డీఎంకే ఎంపీ ఇంటికి క్వారంటైన్ నోటీసు.. కరోనా బాధితురాలి బంధువును కలిసినందుకే!

  • ఇంటికొచ్చి ఎంపీని కలిసిన కరోనా బాధితురాలి బామ్మ
  • తన మనవరాలికి చికిత్స కోసం సిఫారసు లేఖ తీసుకెళ్లిన మహిళ
  • ఆమె మనవరాలికి కరోనా సోకినట్టు తేలడంతో అప్రమత్తం
తమిళనాడులోని కడలూరు డీఎంకే ఎంపీ టీఆర్‌వీఎస్ రమేశ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. బన్రూటిలోని ఆయన ఇంటికి మునిసిపల్ అధికారులు క్వారంటైన్ నోటీసు అంటించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తట్టంచావిడికి చెందిన ఓ మహిళ మనవరాలు కేన్సర్‌తో బాధపడుతోంది. పుదుచ్చేరిలోని జిప్‌మర్ ఆసుపత్రిలో తన మనవరాలికి చికిత్స అందించేలా సిఫారసు లేఖ ఇవ్వాలని కోరుతూ ఆ మహిళ ఎంపీ ఇంటికొచ్చి అర్థించింది. దీనికి స్పందించిన ఎంపీ సిఫారసు లేఖ ఇచ్చారు.

లేఖ తీసుకుని మహిళ ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె మనవరాలికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన ఆరోగ్యశాఖ అధికారులు బాలిక కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు, బాలిక బామ్మ ఎంపీ రమేశ్‌ను కలిసిన విషయం తెలియగానే మునిసిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనను క్వారంటైన్‌లో ఉండాలని సూచించి, ఆయన ఇంటికి క్వారంటైన్ నోటీసులు అంటించారు.


More Telugu News