ఢిల్లీ నుంచి బీహార్‌కు సైకిల్‌పై పయనం.. మార్గమధ్యంలోనే ఊపిరొదిలిన యువకుడు!

  • 1200 కి.మీ. దూరంలోని స్వగ్రామానికి సైకిల్‌పై
  • మార్గమధ్యంలో యూపీలో ఓ టోల్‌ప్లాజా వద్ద రాత్రి నిద్ర
  • నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు చేస్తున్న సాహసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా, బీహార్‌కు చెందిన ఓ యువకుడు ఢిల్లీ నుంచి సైకిల్‌పై బయలుదేరి గమ్యం చేరుకోకుండానే ప్రాణాలు విడిచాడు. బీహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన 28 ఏళ్ల ధర్మవీర్ కుమార్ ఢిల్లీలోని షాకూర్ బస్తీలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన ధర్మవీర్ ఢిల్లీ నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి సైకిలుపై వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

మరో ఆరుగురు స్నేహితులతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. అలా, 350 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చేరుకున్నాడు. పగలంతా ప్రయాణం చేసి అలసిపోయిన వారంతా రాత్రి ఢిల్లీ-బరేలీ మార్గంలో ఉన్న ఓ టోల్‌ప్లాజా సమీపంలో నిద్రపోయారు. ఆ తర్వాతి రోజు అందరూ నిద్రలేచినా ధర్మవీర్ మాత్రం లేవలేదు. తట్టి లేపినా లేవకపోవడంతో అనుమానించిన స్నేహితులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అతడు అప్పటికే మృతి చెందినట్టు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. సుదీర్ఘంగా సైకిల్ తొక్కుతూ అలసిపోయి నీరసించడం వల్లే అతడు మరణించినట్టు పోస్టుమార్టంలో తేలింది. కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహించగా నెగటివ్ వచ్చింది. యువకుడి మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News