కరోనా సంక్షోభం ముగిశాక పాకిస్థాన్ వంటి దేశాలతో ఎలా వ్యవహరించాలో భారత్ కు బాగా తెలుసు: రామ్ మాధవ్

  • కరోనా విపత్తు ముగిశాక పాక్ మారాల్సి ఉంటుందన్న రామ్ మాధవ్
  • భారత్ లో ఇస్లామోఫోబియా లేదని వెల్లడి
  • మోదీ ఫోబియాతో బాధపడుతున్నవారే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
కరోనా విపత్తు సద్దుమణిగాక ప్రపంచవ్యాప్త పరిణామాల్లో మార్పు తథ్యమని, పాకిస్థాన్ స్వీయ ప్రయోజనాలను పక్కనబెట్టి ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పష్టం చేశారు.

పాక్ వంటి దేశాలతో ఎలా వ్యవహరించాలో భారత్ కు తెలుసని అన్నారు. అంతేకాకుండా, భారత్ లో ఇస్లామోఫోబియా నెలకొని ఉందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీకి అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని, మోదీ ఫోబియాతో భయపడుతున్నవారే మత విద్వేషాలతో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

భారత్ లో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాత్ కారణమంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, ఎవరో కొందరు చేసిన తప్పిదాలకు యావత్ మత వర్గాన్ని నిందించడం సరికాదని, ఇలాంటి ధోరణలు ఎవరికీ ప్రయోజనం కలిగించవని అభిప్రాయపడ్డారు.

 ఇక, కరోనా సంక్షోభం ముగిశాక భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుందని, ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు భారత్ వైపు అడుగులు వేస్తాయని రామ్ మాధవ్ అన్నారు. చైనా నుంచి భారత్ కు భారీ ఎత్తున పెట్టుబడుల తరలింపు ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.


More Telugu News