తెలంగాణ వాహనాలను అడ్డుకున్న ఏపీ, ఏపీ వాహనాలను అడ్డుకున్న తెలంగాణ... రోడ్లపై వేలాది మంది!

  • స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి
  • సమన్వయ లోపంతో అడ్డుకున్న తెలుగు రాష్ట్రాల అధికారులు
  • సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
అధికారుల మధ్య సమన్వయ లోపం, వేలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలను నడిరోడ్డుపై నిలిపింది. లాక్ డౌన్ నుంచి సడలింపులు రావడం, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలు, స్వస్థలాలకు వెళ్లేందుకు పరిమితులతో కూడిన అనుమతులు రావడంతో భారీ సంఖ్యలో ప్రజలు రాష్ట్రాలు దాటేందుకు సరిహద్దులకు చేరుకున్న వేళ, అధికారులు వారిని అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళుతున్న వారిని ఏపీ పోలీసులు అడ్డుకోగా, ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద రాష్ట్రాలు దాటేందుకు పాస్ లు ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా రోడ్లపైనే నిలిపివేశారు.

దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా కర్నూలు, నాగార్జున సాగర్, కోదాడ తదితర ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద ప్రజలు భారీ సంఖ్యలో చిక్కుకుని పోయి, పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. నిన్న సాయంత్రం నుంచి బయలుదేరిన వారంతా, ఈ ఉదయం వరకూ సరిహద్దుల వద్దే ఉండిపోయారు. దీంతో సరిహద్దుల వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే ఉన్నతాధికారులు కల్పించుకుని, తాము స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని పలువురు డిమాండ్ చేశారు.


More Telugu News