అత్యధిక జనాభాకు ఉపకరించని లాక్ డౌన్ సడలింపులు... కారణమిదే!

  • షరతులతో కూడిన అనుమతులిచ్చిన కేంద్రం
  • మూడో వంతు ప్రజలు రెడ్ జోన్ పరిధిలోనే
  • అత్యధిక జనసాంధ్రత గల సగం జిల్లాలు కూడా
  • ప్రస్తుతానికి సంపూర్ణ లాక్ డౌన్ లోనే ప్రధాన నగరాలు, పట్టణాలు
కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ, గ్రీన్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు, ఆరంజ్ జోన్లలో షరతులతో కూడిన అనుమతులను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15న కేంద్రం వెల్లడించిన గణాంకాల్లోని రెడ్ జోన్లు తగ్గినప్పటికీ, ఆరంజ్ జోన్లు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక, లాక్ డౌన్ సడలింపులు దేశంలోని మూడింట ఒకవంతు ప్రజలకు ఏ మాత్రం ఉపకరించే అవకాశాలు లేవు. ఎందుకంటే, వీరంతా రెడ్ జోన్ పరిధిలోనే ఉంటారు కాబట్టి.

కేంద్రం రెడ్ జోన్లుగా గుర్తించిన 130 జిల్లాల పరిధిలో న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్ కతా, లక్నో వంటి మెట్రో నగరాలు ఉన్నాయి. వీటితో పాటు ఎన్నో పట్టణాలు కూడా ఈ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇక, ఈ 130 జిల్లాల్లో దాదాపు 40 కోట్ల మంది నివాసం ఉంటున్నారు. మహారాష్ట్ర, యూపీ, వెస్ట్ బెంగాల్, ఏపీల్లోని రెడ్ జోన్లలోనే 21 కోట్ల మంది ఉంటున్నారని అధికారులు వెల్లడించారు.

ఇండియాలోని అత్యధిక జనసాంధ్రత గల 50 జిల్లాల్లో సగం రెడ్ జోన్ పరిధిలోనే ఉండటం గమనార్హం. మూడో వంతు పట్టణాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొని వుండగా, గ్రామాల విషయానికి వస్తే, ఐదో వంతు మాత్రమే రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. రెడ్ జోన్ జిల్లాలు అధికంగా ఉన్న రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ నిలిచింది. అన్ని మెట్రో నగరాల్లోనూ రెడ్ జోన్ అమలులో ఉండటంతో లాక్ డౌన్ సడలింపులు ఈ ప్రాంతాల జనాభాకు ప్రస్తుతానికి ఉపకరించే అవకాశం లేదు.


More Telugu News