విధిలేని పరిస్థితుల్లో కూరగాయలు అమ్ముకుంటున్న నగల వ్యాపారి

  • లాక్ డౌన్ తో మారిన బతుకు చిత్రం
  • నగల దుకాణంలోనే కూరగాయల విక్రయం
  • ఇంటి వద్ద కూర్చుంటే డబ్బులు ఎవరిస్తారంటూ ప్రశ్న
పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం అంటే ఇదేనేమో! జైపూర్ కు చెందిన ఓ నగల వ్యాపారి లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం కూరగాయలు విక్రయిస్తున్నాడు. హుకుంచంద్ సోనీ గత 25 ఏళ్లుగా నగల దుకాణం నడుపుతున్నాడు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించడంతో దుకాణం మూతపడింది. కొన్నిరోజుల పాటు ఎలాగో నెట్టుకొచ్చినా, ఆపై కుటుంబ భారం అధికమైంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూరగాయల అమ్మకం షురూ చేశాడు.

ఒకప్పుడు సరికొత్త డిజైన్ నగలతో అలరారిన ఆ దుకాణం ఇప్పుడు కూరగాయలతో నిండిపోయింది. నగలను తూకం వేసిన త్రాసులో బంగాళాదుంపలు, ఉల్లిగడ్డల బరువు తూయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆ నగల వ్యాపారి హుకుంచంద్ మాట్లాడుతూ, బతకడానికి ఇంతకుమించి మార్గం కనిపించలేదని తెలిపాడు. నగల వ్యాపారంలో తాను పెద్దగా పొదుపు చేసింది ఏమీ లేదని, అందుకే కూరగాయలు అమ్ముకుంటున్నానని వివరించాడు.

తన నగల దుకాణం పెద్దదేమీ కాకపోయినా, కుటుంబ పోషణకు సరిపోయేంత ఆదాయం వచ్చేదని తెలిపాడు. ఉంగరాలు, ఇతర ఆభరణాలు తయారీ, రిపేర్లు చేసుకుంటూ బతికేవాడ్నని, కానీ రోజుల తరబడి ఇంటివద్ద కూర్చుంటే తమకు డబ్బులు, తిండి ఎవరిస్తారని హుకుంచంద్ ప్రశ్నించాడు.


More Telugu News