హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

  • ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీ యజమానులకు నోటీసులు
  • గతంలోనే ఈ అంశంపై ఒక తీర్పును ఇచ్చామన్న హైకోర్టు
  • లాక్ డౌన్ సమయంలో జరిమానాలు విధించడం ఏమిటంటూ ఆగ్రహం
ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారులకు దాదాపు రూ. 2,500 కోట్ల అపరాధ రుసుము విధిస్తూ గనులు, భూగర్భశాఖ గతంలో ఇచ్చిన నోటీసులను హైకోర్టు ఇంతకు ముందే కొట్టేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో, ఓ క్వారీ యజమాని హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు... ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గతంలోనే ఒక తీర్పును వెలువరించామని... ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా గ్రానైట్ పరిశ్రమ మూతపడిన తరుణంలో జరిమానాలు విధించడం ఏమిటని ప్రశ్నించింది.

ఇప్పటికిప్పుడే ప్రభుత్వ నోటీసులకు క్వారీల నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత, గ్రానైట్ పరిశ్రమ గాడిలో పడిన తర్వాత ఆలోచిద్దామని చెప్పింది.


More Telugu News