న్యూస్‌ పేపర్ పరిశ్రమకు రూ.15 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం.. 30 లక్షల మందికి గండం: ఐఎన్ఎస్

  • వార్తా పత్రికల పరిశ్రమకు ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించాలి
  • కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన న్యూస్‌ పేపర్‌ సొసైటీ  
  • రెండు నెలల్లో రూ.4,000 కోట్ల నష్టం
  • న్యూస్‌ ప్రింట్‌పై ఉన్న ఐదు శాతం పన్ను తగ్గించాలి
కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వార్తా పత్రికలకు వస్తోన్న నష్టంపై ఇండియన్ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వార్తా పత్రికల పరిశ్రమకు ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

లాక్‌డౌన్‌ వల్  ఇప్పటికే రెండు నెలల్లో రూ.4,000 కోట్ల నష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించకపోతే తదుపరి ఏడు నెలల్లో మొత్తం కలిపి రూ.15,000 కోట్ల నష్టం వస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఐఎన్‌ఎస్‌ లేఖ రాసింది.

లాక్‌డౌన్‌ వల్ల అత్యధికంగా నష్టపోయిన పరిశ్రమల్లో వార్తా పరిశ్రమ ఒకటని తెలిపింది. రెవెన్యూ, యాడ్స్, సర్క్యులేషన్ భారీగా పడిపోయాయని తెలిపింది. ప్రైవేటు రంగం నుంచి ప్రకటనలు రావట్లేదని చెప్పింది. ఈ పరిస్థితులు మరో ఆరు లేక ఏడు నెలలు ఉండొచ్చని పేర్కొంది. అలాగే, న్యూస్‌ ప్రింట్‌పై ఉన్న ఐదు శాతం పన్ను తగ్గించాలని కోరింది.

న్యూస్‌ పేపర్‌ పరిశ్రమలో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, పేపర్ బాయ్స్ వంటి దాదాపు 30 లక్షల మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధి పొందుతారని, ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల వారిపై ప్రభావం పడిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 800 న్యూస్‌ పేపర్ల సంస్థల్లోని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పింది. లాక్‌డౌన్‌ ఇబ్బందుల వల్ల న్యూస్ పేపర్ పరిశ్రమ తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోతోందని తెలిపింది.


More Telugu News