కరోనా సోకిందేమోనన్న భయంతో మూడో అంతస్తు నుంచి దూకి హైదరాబాదీ ఆత్మహత్య

  • రామాంతపూర్‌లో ఈ రోజు ఉదయం ఘటన
  • ఎసిడిటీతో బాధపడుతోన్న కృష్ణమూర్తి
  • కరోనా లక్షణాలు లేవని తేల్చిన కింగ్‌ కోఠి వైద్యులు
  • మరోసారి గాంధీకి వెళ్దామని నిర్ణయించుకుని అంతలోనే బలవన్మరణం
కరోనా సోకిందేమోనన్న భయంతో తాముంటోన్న భవనంలోని బాల్కనీ నుంచి దూకి ఓ హైదరాబాదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామంతాపూర్‌లో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. వి.కృష్ణ మూర్తి (60) అనే వ్యక్తి రామాంతపూర్‌లోని వీఎస్‌ అపార్ట్‌మెంట్‌లో ‌మూడో అంతస్తులో ఉంటున్నాడు. ఆయనకు ఎసిడిటీ సమస్య ఉంది.

వైద్యులను సంప్రదించి మెడిసిన్స్ వాడేవారు. కొన్ని రోజులుగా ఆయనకు పదే పదే ఆయాసం వస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో తనకు కూడా ఆ వైరస్‌ సోకిందేమోనని భయపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి కింగ్‌ కోఠి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అయితే, ఆయనకు కరోనా లక్షణాలు లేవని వైద్యులు చెప్పారు. అయినా ఆయనలో భయం తగ్గలేదు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈ రోజు ఉదయం గాంధీ ఆసుపత్రికి వెళ్దామని కుటుంబ సభ్యులు సిద్ధమవుతుంటే, మరోవైపు బాల్కనీలోకి వచ్చిన కృష్ణ మూర్తి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News