ట్రాక్టర్‌పైకి దూకి రైతులపై దాడిచేసిన పులి.. భయపడకుండా పోరాడిన రైతులు!

  • ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఘటన
  • ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు పొలానికి వెళ్తుండగా దాడి
  • కర్రలతో దాడిచేసి భయపెట్టిన రైతులు
పొలంలోని ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు ట్రాక్టర్‌పై వెళ్లిన ముగ్గురు రైతులపై ఓ పులి దాడిచేసింది. రైతులు భయపడకుండా తమ వద్ద ఉన్న కర్రలతో పులితో పోరాడారు. దీంతో పులి అడవిలోకి పరుగులు తీసింది. పులి దాడిలో గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. పొలంలోని ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు రామ్ బహదూర్, ఉజగర్ సింగ్, లాల్తా ప్రసాద్‌లు ట్రాక్టర్‌పై బయలుదేరారు. వారు ప్రయాణించే మార్గంలో చెట్ల పొదల్లో నక్కిన ఓ పులి ఒక్కసారిగా ట్రాక్టర్‌పైకి దూకి వారిపై దాడికి యత్నించింది.

వెంటనే అప్రమత్తమైన రైతులు ట్రాక్టర్‌లో ఉన్న కర్రలతో పులిని ఎదిరించే ప్రయత్నం చేశారు. అయితే, పులి ఏమాత్రం తగ్గకుండా రామ్ బహదూర్ పట్టుకున్న కర్రను నోటితో బలంగా పట్టుకోవడంతో కర్ర విరిగింది. దాంతోపాటు పులికూడా కిందపడింది. అనంతరం సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది.

కాగా, పులి దాడిలో గాయపడిన ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పులి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు.


More Telugu News