అందరికీ ఆయన హీరో.. నాకు మాత్రం మంచి స్నేహితుడు: జయప్రద  

అందరికీ ఆయన హీరో.. నాకు మాత్రం మంచి స్నేహితుడు: జయప్రద  
  • హిందీలో నా తొలి హీరో రిషి కపూర్
  • ఆయనతో ఎంతో చనువు ఉండేది
  • రిషి చాలా ధైర్యవంతుడు
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ మరణంతో సీనియర్ నటి జయప్రద తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. రిషి కపూర్ అందరికీ హీరో అయినా... తనకు మాత్రం మంచి స్నేహితుడని చెప్పారు. ఆయనతో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు.

తన మొదటి హిందీ చిత్రం 'సర్గమ్'లో హీరో రిషి కపూర్ అని చెప్పారు. తొలి రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు తన ముందు ఉన్న పెద్ద స్టార్ ను చూసి ఓవైపు సంతోషపడుతూనే, మరోవైపు భయపడుతున్నానని... అప్పుడు ఆయనే తన వద్దకు వచ్చి భయపడొద్దని ధైర్యం చెప్పారని తెలిపారు. ఆయనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని... తనకు డ్యాన్స్ లో ఛాలెంజ్ విసురుతుండేవారని చెప్పారు. తనకు ఏ కష్టం వచ్చినా ఫోన్ చేసి మాట్లాడేంత చనువు ఆయనతో ఉండేదని తెలిపారు. రిషి చాలా ధైర్యవంతుడని అన్నారు. క్యాన్సర్ ను ఆయన ఎదుర్కొన్న విధానమే ఆ విషయాన్ని చెబుతుందని తెలిపారు.

రిషి కపూర్ అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు... అంతా మంచే జరుగుతుందని మెసేజ్ చేసేదాన్నని జయ్రపద చెప్పారు. తన మెసేజ్ పట్ల ఆయన ఎంతో ఆనందంగా స్పందించేవారని  తెలిపారు. తొలి చిత్రం 'బాబీ' నుంచి ఆయనది ఒక సుదీర్ఘమైన సినీ ప్రయాణమని చెప్పారు. సినిమాల్లో ప్రతి పాత్ర ఆయన కోసమే రాసినట్టు అనిపించేదని అన్నారు.


More Telugu News