లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం!

  • మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు
  • మే 17 వరకు లాక్ డౌన్
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో 2 వారాల పాటు పొడిగించింది. మే 4వ తేదీ నుంచి మూడో విడత లాక్ డౌన్ ప్రారంభం కానుంది.  మే 17 వరకు లాక్ డౌన్  కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్ లో కట్టుదిట్టమైన చర్యలు, ఆంక్షలు అలాగే కొనసాగనున్నాయి. కంటైన్మెంట్ జోన్లలో పూర్తి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆరంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులనిచ్చింది.

గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. 33 శాతం సిబ్బందితో గ్రీన్ జోన్లలో ప్రైవేట్ కార్యాలయాలు పని చేయవచ్చని తెలిపింది. వలస కూలీలను తరలించేందుకు రైళ్లకు అనుమతి ఇచ్చింది. విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై కూడా నిషేధం కొనసాగనుంది.

గ్రీన్ జోన్ లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి  7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతించారు. ఆరంజ్ జోన్లలో వాహనాలకు అనుమతి ఇచ్చారు. అయితే  కార్లలో ఇద్దరు, టూవీలర్ పై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని షరతు విధించారు. ఆరంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు. ఈ రెండు జోన్లలో ప్రైవేట్ క్యాబ్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో బస్సుల ప్రయాణాలకు అనుమతించారు.

దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్సులపై నిషేధం కొనసాగనుంది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, జనాలు గుమికూడటంపై ఆంక్షలు కొనసాగనున్నాయి. మతపరమైన కార్యక్రమాలకు జనాలు హాజరుకావడంపై కూడా నిషేధం కొనసాగనుంది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా ప్రయాణాలకు, కేంద్ర హోంశాఖ సూచించిన నిబంధనల మేరకు అనుమతించే అవకాశం ఉంది.


More Telugu News