20 రోజులు కరోనా విధులు నిర్వర్తించి వచ్చిన మహిళా డాక్టర్ కు అపూర్వ స్వాగతం... వీడియో పోస్టు చేసిన ప్రధాని

  • మూడు వారాల తర్వాత ఇంటికొచ్చిన వైద్యురాలు
  • అపార్ట్ మెంట్ ప్రజలంతా కలిసి వచ్చి స్వాగతించిన వైనం
  • పూలు చల్లుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆత్మీయత
కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమో తెలిసిన తర్వాత, ఆ వైరస్ సోకిన రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు ప్రాణాలకు తెగించినట్టేనని భావించాలి. అందుకే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఇప్పుడు సాహసవీరుల్లా కనిపిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20 రోజుల పాటు ఇంటి ముఖం చూడకుండా కరోనా పేషెంట్లకు ఐసీయూలో వైద్య సేవలు అందించిన ఓ లేడీ డాక్టర్ ఇంటికి వచ్చిన వేళ ఆమెకు అపూర్వ స్వాగతం లభించడం ఈ కోవలోకే వస్తుంది.

దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఆ వైద్యురాలు తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ వద్దకు రాగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగాలకు లోనై ఆనంద బాష్పాలు రాల్చడం వీడియోలో చూడొచ్చు. అపార్ట్ మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ఆమెపై పూలవర్షం కురిపిస్తూ లోపలికి ఆహ్వానించారు. చిన్నాపెద్దా ప్లకార్డులతో ఆమె ధైర్యసాహసాలను ప్రస్తుతిస్తూ ఆత్మీయతను చాటారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

దీనిపై మోదీ వ్యాఖ్యానిస్తూ, ఇలాంటివి చూస్తుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుందని పేర్కొన్నారు. భారతదేశ స్ఫూర్తి అంటే ఇదేనని, మనం కొవిడ్-19తో ధైర్యంగా పోరాడుతున్నామని వివరించారు. అత్యంత ప్రమాదకర వైరస్ తో ముందు నిలిచి పోరాడుతున్న ఇలాంటి వారు ఎప్పటికీ గర్వించేలా చేస్తున్నారని కొనియాడారు.


More Telugu News