శ్రీకాకుళం జిల్లా డోలపేటకు చేరుకున్న వలస కార్మికులు.. తీవ్ర ఉద్రిక్తత!

  • రావులపాలెం నుంచి డోలపేటకు చేరుకున్న 200 మంది కార్మికులు
  • స్థానిక పాఠశాలలో క్వారంటైన్ ఏర్పాటు
  • అధికారులను అడ్డుకున్న స్థానికులు
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే, వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ఏపీ ప్రభుత్వం స్వస్థలాలకు రప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రావులపాలెం నుంచి నాలుగు బస్సుల్లో 200 మంది కార్మికులను డోలపేటకు తరలించారు. ఈ ఉదయం డోలపేటకు చేరుకున్న వీరికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అధికారులు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. మొత్తం సమస్యకు ఇదే కారణమైంది.

తమ నివాసాల మధ్య క్వారంటైన్ ఏర్పాటు చేయవద్దని అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. వలస కూలీల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తమ పరిస్థితి ఏం కావాలని వారు ప్రశ్నించారు. వారితో అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారి లాఠీలకు పని కల్పించారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మహిళలు కూడా గాయపడ్డారు. దీంతో ఉద్రక్తత మరింత పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వారంటైన్ అనుమతించబోమని స్థానికులు తేల్చి చెప్పారు.


More Telugu News