ఆ మహమ్మారి ల్యాబ్ నుంచే వచ్చింది.. ప్రపంచంపై విరుచుకుపడింది: ట్రంప్ ఆరోపణలు

  • వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ బయటకు వచ్చింది
  • అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ బయటపెట్టేందుకు అనుమతి లేదు
  • త్వరలోనే నిజాలు నిగ్గుతేలుతాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని ఆరోపించారు. ఈ వైరస్ మానవ సృష్టి కాదని అమెరికా నిఘా విభాగం తేల్చేసిన కొన్ని గంటల్లోనే అందుకు విరుద్ధంగా ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

వైరస్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని చెప్పేందుకు అవసరమైన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు వాటిని బయటపెట్టబోమని ట్రంప్ అన్నారు. అలా బయటపెట్టే అనుమతి తనకు కూడా లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ పేర్కొన్నారు. విచారణ జరుగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.  

వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చినప్పటికీ దానికి ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మాత్రం బాధ్యుడ్ని చేయలేనని ట్రంప్ పేర్కొనడం విశేషం. వైరస్ కట్టడి విషయంలో చైనా కావాలనే నిర్లక్ష్యం వహించిందా? అన్న విషయాన్ని పక్కనపెడితే వైరస్ మాత్రం ప్రపంచంపై భారీస్థాయిలో విరుచుకుపడిందని అన్నారు. కీలక సమయంలో స్పందించకపోయి ఉంటే అమెరికాలో పరిస్థితి మరింత దిగజారి ఉండేదని ట్రంప్ అన్నారు. వైరస్ విషయంలో చైనాలో ఏం జరిగిందన్న విషయాలన్నీ విచారణలో వెలుగులోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.


More Telugu News