భారత్‌లో కరోనా నియంత్రణ, ఆరోగ్య సౌకర్యాలకు అమెరికా ఆర్థిక సాయం

  • యూఎస్‌ఏఐడీ ద్వారా అందిస్తున్నట్టు అమెరికా ప్రకటన
  • ఈ మొత్తాన్ని కరోనా వ్యాప్తి నివారణ, బాధితుల రక్షణకు వినియోగం
  • పీఎం జేఏవై పథకంలో లబ్ధిదారులకు ఆరోగ్య సౌకర్యాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పై పోరులో భారత్‌కు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి  సహాయపడే ప్రయత్నాల్లో భాగంగా... 'పాహల్' (ఆరోగ్య సంరక్షణ సంబంధిత) ప్రాజెక్టుకు 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) సాయాన్ని అందజేస్తామని  గురువారం ప్రకటించింది.

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్‌ కు సహాయం చేయడానికి  యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) ఇప్పటివరకు 5.9 మిలియన్ డాలర్లు అందించింది. ఈ మొత్తం ఇండియాలో వైరస్‌ వ్యాప్తిని తగ్గించడానికి, బాధితులకు రక్షణ కల్పించడానికి, ప్రజలకు అవసరమైన ప్రజారోగ్య సందేశాలు చేరవేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే, వైరస్‌ కేసుల గుర్తింపు, నిఘాను బలోపేతం చేయడానికి సహాయపడనుంది.

యూఎస్‌ఏఐడీ ద్వారా 3 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఏప్రిల్ 16న అమెరికా అధికారులు తెలిపారు. ‘పాహల్’ ప్రాజెక్టు ద్వారా జాతీయ ఆరోగ్య అథారిటీకి యూఎస్‌ఏఐడీ మద్దతు అందించనుంది. తద్వారా ఆరోగ్య సదుపాయాలకు సహాయం చేయడానికి ప్రైవేటు రంగం నుండి వనరులను సమీకరించి ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై)లో చేర్చిన  20 వేలకు పైగా ఆరోగ్య సదుపాయాలను 50 కోట్ల మంది పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.

‘కోవిడ్-19 ను ఎదుర్కొనే నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఇండియాకు మద్దతు ఇవ్వడానికి ఈ అదనపు నిధులు ఇస్తున్నాం. ఇది ఇరు దేశాల  మధ్య బలమైన, నిరంతర భాగస్వామ్యానికి మరో ఉదాహరణ’ అని యుఎస్ రాయబారి కెన్నెత్ జస్టర్ పేర్కొన్నారు.


More Telugu News