కరోనా మహమ్మారితో 160 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయే రిస్క్: ఐఎల్ఓ

  • 43 కోట్ల కంపెనీలపై మహమ్మారి ప్రభావం
  • రిటైల్, మాన్యుఫాక్చరింగ్ రంగాలపై కోలుకోలేని దెబ్బ
  • జీవనం సాగించలేని స్థితిలో కోట్లాది మంది
  • హెచ్చరించిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
ప్రపంచంలోని దాదాపు 160 కోట్ల మంది కార్మికులు కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారని ఐక్యరాజ్యసమితి కార్మిక విభాగం హెచ్చరించింది. కొవిడ్-19 ప్రభావంతో పనిగంటలు తగ్గడం కూడా ఇందుకు కారణం కానుందని ఐరాస నేతృత్వంలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) వెల్లడించింది.

చిన్న, మధ్య తరహా విభాగాల్లోని 43 కోట్ల కంపెనీలపై వైరస్ ప్రభావం చాలా అధికంగా ఉందని, రిటైల్, మాన్యుఫాక్చరింగ్ రంగాలను కోలుకోలేని దెబ్బ తీసిందని పేర్కొంది. ఈ అంచనాలను 'ఐఎల్ఓ మానిటర్ థర్డ్ ఎడిషన్ - కొవిడ్ 19 అండ్ ది వరల్డ్ ఆఫ్ వర్క్' పేరిట ఐరాస బుధవారం నాడు విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తూ, జీవనం కొనసాగిస్తున్నారని, వీరిలో కరోనా కారణంగా 160 కోట్ల మంది తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డారని, వీరంతా ప్రస్తుతం జీవనం సాగించలేని క్లిష్ట పరిస్థితుల్లోకి జారి పోయారని పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా అయితేనేమి లేదా కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తున్న రంగాల్లో పనిచేస్తుండటమేమి వీరిప్పుడు కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉన్నారని హెచ్చరించింది.

కరోనా కష్టాలు ప్రారంభమైన తరువాత, తొలి నెల రోజుల్లో వీరి ఆదాయం 60 శాతం పడిపోయిందని అంచనా వేసిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో 80 శాతానికి పైగా, మధ్య ఆసియా, యూరప్ రీజియన్లలో 70 శాతానికి పైగా, ఆసియా పసిఫిక్ రీజియన్లో 21.6 శాతానికి పైగా ఆదాయాన్ని కార్మికులు కోల్పోయారని, రెండో నెలలో మరింతగా ఆదాయం కోల్పోనున్నారని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గుయ్ రైడర్ హెచ్చరించారు.

ప్రపంచంలోని కోట్లాది మంది కార్మికులకు ఆదాయం రావడం లేదంటే, వారి కనీస అవసరాలైన ఆహారానికి వెచ్చించేందుకు డబ్బు లేనట్లేనని, వారి భద్రత, భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టేనని, వారి వద్ద పొదుపు చేసుకున్న డబ్బు ఉండదని, వారికి రుణాలిచ్చేందుకూ ఎవరూ ముందుకు రారని అభిప్రాయపడ్డారు. వారిని ఆదుకునేందుకు వెంటనే కదలకుంటే, వారంతా వ్యవస్థ నుంచి తుడిచిపెట్టుకు పోతారని, దీనివల్ల మరింత ఆర్థిక నష్టం ఏర్పడుతుందని వెల్లడించారు.


More Telugu News