బజాజ్ ఆటో త్రైమాసిక ఫలితాలు వాట్సాప్‌లో లీక్.. ఇద్దరికి రూ. 30 లక్షల జరిమానా!

  • కొన్ని సంస్థల షేర్ల ధరలను ప్రభావితం చేసేలా సమాచారం లీక్
  • దర్యాప్తు చేపట్టిన సెబీ
  • ఇద్దరికి చెరో రూ. 15 లక్షల చొప్పున జరిమానా
2016-17లో బజాజ్ ఆటోకు సంబంధించిన నాలుగో త్రైమాసిక ఫలితాలను వాట్సాప్‌లో ముందే లీక్ చేసిన కేసులో ఇద్దరికి చెరో రూ. 15 లక్షల చొప్పున సెబీ జరిమానా విధించింది. స్టాక్ ఎక్స్‌చేంజీలకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందించకముందే కొన్ని సంస్థల షేర్ల ధరలను ప్రభావితం చేసేలా ప్రైస్ సెన్సిటివ్ సమాచారం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అప్రమత్తమైంది.

దీనిపై విచారణ జరిపి 26 వాట్సాప్ గ్రూపుల్ని, 190 పరికరాలను జప్తు చేసి విశ్లేషించగా మొత్తం 12 కంపెనీల ఫలితాలు, ఆర్థిక సమాచారం వాట్సాప్ ద్వారా లీక్ అయినట్టు గుర్తించింది. ఈ లీకుల్లో బజాజ్ ఆటోకు చెందిన ఆర్థిక ఫలితాలు చాలా దగ్గరగా ఉండడంతో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించిన సెబీ.. నీరజ్ కుమార్ అగర్వాల్, శ్రుతి విశాల్ ఓరాలే ఈ పనికి పాల్పడినట్టు నిర్ధారించింది. దీంతో వీరిద్దరికీ చెరో రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


More Telugu News