లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత

  • కచ్చితంగా పొడిగిస్తాం
  • ప్రజలు మానసికంగా సిద్ధం కావాలి
  • గ్రీన్ జోన్లలో మరిన్ని సడలింపులు
లాక్‌డౌన్ పొడిగింపుపై జరుగుతున్న ఊహాగానాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెక్‌పెట్టారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా కొనసాగిస్తామని, అందుకు ప్రజలు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. దేశంలో కేసులు, మరణాల సంఖ్య  పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో ఎత్తివేయడం సాధ్యం కాదని, కాబట్టి కచ్చితంగా పొడిగిస్తామని తేల్చి చెప్పారు.

ఈ మేరకు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, ప్రభుత్వాధికారులు పలు సూచనలు చేశారన్నారు. వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోను, రెడ్‌జోన్లలోనూ లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని వారంతా కోరుతున్నారని అన్నారు. దేశంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కరోనాను అరికట్టే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన అవసరం ఉందని, ప్రజలు అందుకు మానసికంగా సిద్ధం కావాల్సిందేనని అన్నారు. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం కఠిన నిర్ణయాలు తప్పడం లేదన్నారు. గ్రీన్ జోన్లలో ప్రజా రవాణా, మాల్స్, థియేటర్లకు తప్ప దాదాపు అన్నింటికీ అనుమతి ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. మే 3 తర్వాత గ్రీన్ జోన్లలో మరిన్ని వెసులుబాటులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అయితే, విమానాలు, బస్సులు, రైళ్లు వంటివి మాత్రం ఇప్పుడే ప్రారంభించే అవకాశం లేదని మాత్రం తాను అనుకుంటున్నట్టు కిషన్ రెడ్డి వివరించారు.


More Telugu News