ధారావిని వీడని మహమ్మారి.. 344కు పెరిగిన కేసులు

  • ధారావిలో నేడు 14 కేసులు.. మరణాలు నిల్
  • మహారాష్ట్రలో 10 వేలకు చేరువలో కేసులు
  • రాష్ట్రవ్యాప్తంగా 432 మంది మృతి
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారావిని కరోనా మహమ్మారి వీడడం లేదు. నిత్యం అక్కడ కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. నేడు కొత్తగా మరో 14 కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 344కు పెరిగింది. అయితే, మరణాలు మాత్రం సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇక్కడ ఇప్పటి వరకు 18 మంది మరణించారు. మహీంలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాదర్‌లో నేడు కొత్త కేసులు నమోదు కాలేదని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది.

మరోవైపు, మహారాష్ట్రలో కేసులు, మరణాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు 10 వేలకు చేరాయి. ఈ రోజు 597 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 9,915కు చేరింది. అలాగే, 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 432కు పెరిగింది. రాష్ట్రంలో హాట్‌స్పాట్‌గా మారిన ముంబైలో కొత్తగా 475 కేసులు వెలుగు చూడడంతో నగరంలోని మొత్తం కేసుల సంఖ్య 6,644కు పెరిగింది. మొత్తం మరణాల్లో 26 ఇక్కడే సంభవించడం గమనార్హం.


More Telugu News