కేంద్రం నుంచి గుడ్‌న్యూస్.. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి!

  • మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
  • తరలింపులో ఇరు రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి
  • బయలుదేరే ముందు బస్సులను శానిటైజ్ చేయాలని సూచన
లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వారిని స్వరాష్ట్రాలకు చేర్చేందుకు కేంద్ర హోం శాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్రంలోని అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాధిపతులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఉత్తర్వులు జారీ చేశారు.

కార్మికులు, వలస కూలీలు, విద్యార్థుల తరలింపుపై ఇరు రాష్ట్రాల అంగీకారం ఉండాలని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించుకుని చిక్కుకుపోయిన వారి వివరాలను సేకరించాలని, ఆ తర్వాత అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతించాలని సూచించింది. అలాగే, తరలింపులో భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది. బస్సులు బయలుదేరే ముందు శానిటైజ్ చేయాలని పేర్కొంది.

స్వస్థలాలకు చేరుకున్న తర్వాత అక్కడ వారికి మరోమారు పరీక్షలు నిర్వహించాలని, అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని సూచించింది. క్వారంటైన్ అవసరం లేని వారిని మాత్రం ఇళ్లకే పరిమితం చేస్తూ క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అలాగే, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే వారిని ఆరోగ్యసేతు యాప్ ద్వారా పరీక్షించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.


More Telugu News