మా అమ్మ వచ్చింది.. నన్ను తీసుకు వెళ్లడానికి!: మరణానికి కొన్ని క్షణాల ముందు ఇర్ఫాన్ అన్నది ఇదే!

  • మరణాన్ని ముందే ఊహించిన ఇర్ఫాన్
  • సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ‘పద్మశ్రీ’ వరకు ఎదిగిన నటుడు
  • తన భార్య కోసమైనా బతకాలని ఉందన్న ఇర్ఫాన్
మరణాన్ని ముందే ఊహించి అందుకు సిద్ధంగా ఉన్నట్టు గతంలోనే ప్రకటించిన బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈ రోజు తుది శ్వాస విడిచి బాలీవుడ్‌ను కన్నీటి సంద్రంలోకి నెట్టేశారు. కేన్సర్ బారినపడిన ఆయన కోలుకున్నప్పటికీ అనూహ్యంగా పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుతూ మృతి చెందారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకున్నా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడంతోపాటు హాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ 2011లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకునేంత వరకు ఎదిగారు. ఈ ఏడాది మార్చి 13న ఆయన నటించిన చివరి చిత్రం ‘ఆంగ్రేజీ మీడియం’ విడుదలైంది. అయితే, లాక్‌డౌన్ కారణంగా ఆ చిత్రానికి ఆదరణ లభించలేదు.

ఆంగ్రేజీ మీడియం సినిమా విడుదలకు ముందు ఇర్ఫాన్ మాట్లాడుతూ.. తన భార్య కోసమైనా బతకాలని ఉందని అన్నారు. తనకు కేన్సర్ సోకిన విషయం తెలిసిన తర్వాత 24 గంటలూ తనతోనే ఉందని, తనను అత్యంత జాగ్రత్తగా చూసుకుందని అన్నారు. తాను ఇప్పటికీ ఇలా ఉన్నాననంటే ఆమే కారణమని పేర్కొన్నారు. పేగు ఇన్ఫెక్షన్‌తో ఇటీవల ముంబైలో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేరిన 53 ఏళ్ల ఇర్ఫాన్ అంతలోనే మృతి చెందడం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.

ఇర్ఫాన్ ఈ రోజు మృతి చెందడానికి కొన్ని క్షణాల ముందు ఆయన మాట్లాడిన మాటలు గుండెలను పిండేస్తున్నాయి. ‘‘నన్ను తీసుకెళ్లేందుకు మా అమ్మ వచ్చింది’’ అని ఆయన అన్నట్టు ఆ సమయంలో ఇర్ఫాన్ పక్కన ఉన్నవారు పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) మృతి చెందారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరగ్గా ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు. ఈ ఘటన ఆయనను మరింత బాధ పెట్టేలా చేసింది. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.


More Telugu News