దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన ఇర్ఫాన్ ఖాన్ మరణం.. ప్రముఖుల సంతాపాలు!

  • గత కొంతకాలంగా చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఆయన చిత్రాలను గుర్తు చేసుకుంటున్న సినీ ప్రేక్షకులు
  • ట్విట్టర్ లో వైరల్ అవుతున్న 'రిప్ ఇర్ఫాన్' హ్యాష్ ట్యాగ్
గత కొంతకాలంగా అనారోగ్యంతో వుండి, మృత్యువుతో పోరాడుతున్న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, ఈ ఉదయం ముంబయిలో కన్నుమూయడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. పలు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తనదైన శైలిలో మెప్పించిన ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.

"ఇర్ఫాన్ ఖాన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మరణవార్త విని చలించిపోయాను. ఆయన కుటుంబీకులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను... ఓమ్ శాంతి" అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు.

"ఈ తరం నటీనటుల్లో ఇర్ఫాన్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు, నటన ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను" అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, "నేటి తరంలో చెప్పుకోతగ్గ నటుడైన ఇర్ఫాన్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది నన్ను షాక్ నకు గురి చేసింది. ఆయన కుటుంబానికి ఈ సమయంలో తట్టుకుని నిలిచే బలాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి" అని వ్యాఖ్యానించారు.

తమ కుటుంబాన్ని ఇర్ఫాన్ ఎంతో చక్కగా చూసుకున్నారని, ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని ఖాన్ కుటుంబం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ట్విట్టర్ లో నిమిషాల వ్యవధిలోనే 'ఇర్ఫాన్ ఖాన్', 'రిప్ ఇర్ఫాన్' హ్యాష్ ట్యాగ్ లు వైరల్ అయ్యాయి. తల్లిని కోల్పోయిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఇర్ఫాన్ అసువులు బాయడం గమనార్హం.

కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. అతని నటనలో ఉన్న సహజత్వం, పోషించిన వైవిధ్య భరితమైన పాత్రల ఆధారంగా అతన్ని భారతీయ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. 'పాన్ సింగ్ తోమర్' సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివ‌రిగా 'అంగ్రేజీ మీడియం' అనే సినిమాలో నటించాడు.

ఆయన నటించిన ఇతర హిట్ చిత్రాల్లో 'ది నేమ్‌సేక్', 'సలాం బాంబే', 'కమలాకీ మౌత్', 'జజీరే', 'లైఫ్ అఫ్ పై' 'నో బెడ్ ఆఫ్ రోజెస్', 'హిస్', 'జురాసిక్ వరల్డ్' తదితరాలున్నాయి. తెలుగులో మహేశ్ బాబు హీరోగా నటించిన 'సైనికుడు' చిత్రంలో విలన్ గా ఇర్ఫాన్ నటించి మెప్పించారు. 'ది జంగిల్ బుక్' చిత్రంలో బబ్లూ పాత్రకు గాత్రదానాన్ని కూడా చేశారు.


More Telugu News