గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారులను 54 బస్సుల్లో ఏపీకి పంపించారు!: కిషన్‌రెడ్డి

  • కరోనా సాయం కింద ఏపీకి రూ.179 కోట్లు ఇచ్చాం
  • గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకుంటున్నాం
  • గుజరాత్‌ సీఎంతో అమిత్ షా మాట్లాడారు
  • 4,069 మంది ఏపీ మత్స్యకారులను పంపుతున్నాం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో తాను కరోనా వల్ల ఏర్పడిన సమస్యలపై మాట్లాడానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కరోనా సాయం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.179 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఏపీలోని రైతుల ఖాతాల్లో రూ.918 కోట్లు జమ చేశామని తెలిపారు.

అలాగే, ఏపీలోని మహిళలకు రూ.300 కోట్లు ఇచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఏపీలోని భవన నిర్మాణ కార్మికులకు రూ.196 కోట్ల సాయం చేశామని వివరించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థకు రూ.550 కోట్లు ఇచ్చామని చెప్పారు.

గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకుంటున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు. గుజరాత్‌ సీఎంతో అమిత్ షా మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారని చెప్పారు. 4,069 మంది ఏపీ మత్స్యకారులను పంపేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

మత్స్యకారులు 54 బస్సుల్లో బయలుదేరి ఏపీకి వెళ్లారని వివరించారు. సమస్య పరిష్కరించిన కేంద్ర హోం మంత్రి, గుజరాత్‌ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారులను ఆదుకోవాలని అనేక మంది విజ్ఞప్తి చేశారని తెలిపారు.

కాగా, కరోనా తీవ్రత మేరకు లాక్‌డౌన్‌ వంటి అంశాలపై మార్పులు, చేర్పులు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని కిషన్‌ రెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాలు కొన్ని మినహాయింపులు ఇచ్చాయన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నారని వివరించారు.

దేశంలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల విషయంలో త్వరలోనే ఓ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని కిషన్‌ రెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా గ్రీన్‌ జోన్‌లలో పలు సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.


More Telugu News