కేవలం 0.2 శాతమే... భారత వృద్ధి అంచనాను మరింతగా తగ్గించిన మూడీస్!

  • మార్చి 24న వృద్ధి రేటును 5.2 నుంచి 2.5 శాతానికి తగ్గించిన మూడీస్
  • అదే దారిలో మిగతా రేటింగ్ సంస్థల అంచనాలు
  • లాక్ డౌన్ కొనసాగితే మరింత పతనం ఖాయమంటున్న నిపుణులు
2020 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 0.2 శాతానికి పరిమితం కానుందని రీసెర్చ్ అండ్ రేటింగ్ సేవలందిస్తున్న మూడీస్ అంచనా వేసింది. ఈ మేరకు గతంలో తాము వేసిన 2.5 శాతం జీడీపీ అంచనాలను సవరిస్తున్నట్టు పేర్కొంది. 2021 సంవత్సరంలో మాత్రం ఆర్థిక వృద్ధి పుంజుకుని 6.2 శాతం వరకూ వెళ్లవచ్చని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అభిప్రాయపడింది.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 24న దేశవ్యాప్త లాక్ డౌన్ ను ప్రకటించిన వెంటనే, వృద్ధి రేటు అంచనాలను 5.2 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించిన మూడీస్, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న గుర్తింపును కూడా ఇండియా కోల్పోనుందని, ఆ స్థానాన్ని చైనా సొంతం చేసుకుందని వెల్లడించింది. ఈ సంవత్సరం చైనాలో ఒక శాతం వృద్ధి, వచ్చే ఏడాది 7.1 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది.

2020లో చైనా, ఇండియాలతో పాటు ఇండొనేషియా మాత్రమే జీడీపీ వృద్ధిని నమోదు చూడనున్నాయని, మిగతా ప్రపంచ దేశాలన్నీ నష్టపోయేవేనని మూడీస్ తన తాజా రిపోర్టులో అంచనా వేసింది. జీ-20లోని ఇతర అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నీ, 4 శాతం మేరకు జీడీపీని కోల్పోనున్నాయని తెలిపింది.

ఇదే సమయంలో జపాన్ కు చెందిన బ్రోకరేజ్ సంస్థ నోమురా, భారత వృద్ధి 0.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేయగా, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) వృద్ధి రేటు 0.9 శాతం వరకూ ఉంటుందని పేర్కొంది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మాత్రం, మే 3 తరువాత లాక్ డౌన్ ను కొనసాగిస్తే, జీడీపీ 2.1 శాతం కన్నా దిగువకు పడిపోతుందని హెచ్చరించింది.

ఇక ఇతర రేటింగ్ సంస్థల భారత అంచనాలను (2020-21) పరిశీలిస్తే, ఫిచ్ రేటింగ్స్ 0.8 శాతం, గోల్డ్ మన్ సాక్స్ 1.6 శాతం, వరల్డ్ బ్యాంక్ 1.5 నుంచి 2.8 శాతం, ఐఎంఎఫ్ 1.9 శాతం, ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ 4 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొన్నాయి.


More Telugu News