తనతో కలిసి కొన్ని మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ కోసం మూడు ఫ్లైట్లు మారిన ధోనీ!

  • 2016లో పంజాబ్ క్రికెటర్ మన్ దీప్ సింగ్ వివాహం
  • రెండు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించిన ధోనీ
  • ధోనీ ఎంతో నిగర్వి అంటూ కితాబిచ్చిన మన్ దీప్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రత్యేకత ఏంటని ఎవరిని అడిగినా అతని నిరాడంబర వ్యక్తిత్వమేనని ముక్తకంఠంతో చెబుతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, అహం తలకెక్కించుకోని వైఖరి ధోనీని అందరివాడ్ని చేశాయి.  సచిన్, ద్రావిడ్, గంగూలీ అంతటివాళ్లు జట్టులో ఉన్నాగానీ, యువ క్రికెటర్లకు అవకాశాలిచ్చేందుకు ధోనీ ముందుండేవాడు.

ఆ విధంగా అవకాశం అందిపుచ్చుకున్నవాడే మన్ దీప్ సింగ్. పంజాబ్ కు చెందిన ఈ బ్యాట్స్ మన్ లో ఎంతో ప్రతిభ ఉందని నమ్మిన ధోనీ జట్టులోకి తీసుకున్నాడు. దురదృష్టం కొద్దీ మన్ దీప్ జట్టులో స్థానం సుస్ధిరం చేసుకోలేకపోయాడు. అయితేనేం, ధోనీ మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని మన్ దీప్ సింగ్ స్వయంగా వెల్లడించాడు.

మన్ దీప్ 2016లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి ధోనీతో కలిసి కేవలం కొన్ని మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఆ పరిచయంతోనే తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. కానీ, తాను న్యూయార్క్ వెళ్లాల్సి ఉందని, వివాహ వేడుకకు వచ్చే విషయం కచ్చితంగా చెప్పలేనని ధోనీ బదులిచ్చాడు. అయితే, మన్ దీప్ ను ఆశ్చర్యానికి గురిచేస్తూ ధోనీ అతని పెళ్లికి హాజరయ్యాడు. అందుకోసం ఏకంగా మూడు విమానాలు మారాల్సి వచ్చింది. అది డిసెంబరు మాసం కావడంతో దట్టంగా మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా, రెండు గంటల పాటు రోడ్డుమార్గంలో ప్రయాణించి, పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. మన్ దీప్ సింగ్ ను, అతని అర్ధాంగిని దీవించి వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపాడు.

దీనిపై తాజాగా మన్ దీప్ సింగ్ మాట్లాడుతూ, తాను ధోనీతో కలిసి ఆడింది కొన్ని మ్యాచ్ లే అయినా, ఎంతో శ్రమ తీసుకుని పెళ్లికి రావడం అతని నిరాడంబర వ్యక్తిత్వానికి నిదర్శనం అని కొనియాడాడు. ధోనీ గొప్పదనం అదేనని తెలిపాడు. తాను తొలిసారి జట్టుకు ఎంపికైన సమయంలో ధోనీ ఎక్కువగా తనతో కలిసి భోజనం చేసేవాడని, తామిద్దరం ఇండియన్ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేసేవాళ్లమని, బిర్యానీ తెచ్చుకుని నేలపై కూర్చుని తినేవాళ్లమని మన్ దీప్ గుర్తు చేసుకున్నాడు.


More Telugu News