వైరస్‌తో కూడా స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల నేర్పు జగన్ కు ఉందేమో కానీ పేదలకు లేదు: అచ్చెన్నాయుడు

  • ‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందడంలోనూ ఏపీ నెంబర్ వ‌న్ 
  • విశాఖ‌లో ‘కరోనా’ కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్య‌పెడుతున్నారు
  • ‘పాజిటివ్’ వస్తే డిశ్చార్జి.. ‘నెగెటివ్’ అయితే వైద్యం చేస్తారా?
ఏపీ సీఎం జగన్ రోజుకో మాట చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘కరోనా‘కు భయపడాల్సిన పని లేదని, జ్వరం లాంటిదే కనుక త‌గ్గిపోతుందంటున్న జగన్, తాడేప‌ల్లిలోని తన నివాసం దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదెందుకు? అని ప్రశ్నించారు. వైరస్‌తో కూడా స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల నేర్పు వైఎస్ వార‌సుడిగా జగన్ కు ఉందేమో కానీ, లాక్‌డౌన్‌తో తిన‌డానికి తిండిలేక‌, చేయ‌డానికి ప‌నిలేక అల్లాడిపోతున్న పేద‌ల‌కు లేదని అన్నారు.

దేశంలోనే కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌డంలో ఏపీ నెంబ‌ర్‌వ‌న్ అని జగన్ ప్రకటించడంపైనా ఆయన విమర్శలు చేశారు. ‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందడంలోనూ, ఎక్కువ మ‌ర‌ణాల్లోనూ, త‌క్కువ రిక‌వ‌రీలోనూ ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఏపీయే నెంబ‌ర్‌వ‌న్ అని అన్నారు. విశాఖ‌ప‌ట్నంలో ‘కరోనా’ కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్య‌పెడుతున్నారని, 1,600కి పైగా పెండింగ్ లో ఉన్న టెస్టుల ఫలితాలు వెల్లడిస్తే లెక్క తేలిపోతుందని అన్నారు.

‘పాజిటివ్’ వస్తే డిశ్చార్జి చేసి, ‘నెగెటివ్’ అయితే వైద్యం చేస్తున్నప్పుడే జగన్ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమైందని ఘాటు విమర్శలు చేశారు. రోజూ చంద్రబాబుపై పడి ఏడవడం ఆపి ‘కరోనా’ కట్టడి కోసం పనిచేయండంటూ జగన్ కు సూచించారు.


More Telugu News