గాలిలో కొవిడ్‌-19 వైరస్‌ జన్యు అవశేషాలు.. గుర్తించిన పరిశోధకులు

  • గాలిలోని ఆర్‌ఎన్‌ఏ వల్ల ఇతరులకి ఇన్ఫెక్షన్‌ సోకిన ఆధారాలు లేవు
  • రెండు ఆసుపత్రుల చుట్టూ పరిశోధన
  • గాలిలోని నీటి తుంపరలను గుర్తించే ఎలక్ట్రిక్ ఏరోజల్ డిటెక్టర్ల అమరిక
  • వైరస్‌తో కూడిన తుంపరులు ఆర్‌ఎన్‌ఏకు ఆవాసాలుగా మారిన వైనం
మానవాళిని ముప్పు తిప్పలు పెడుతూ, పలు సందర్భాల్లో పరీక్షలకు సైతం దొరకకుండా తప్పించుకుంటున్న కరోనా వైరస్‌ గురించి చైనాలోని వూహాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు మరో విషయాన్ని గుర్తించారు. కరోనా వైరస్‌ బారిన పడిన వారికి చికిత్స అందిస్తోన్న ఆసుపత్రుల పరిసరాల్లోని గాలిలోనూ కరోనా జన్యు అవశేషాలు ఉన్నట్లు తేల్చారు.

అయితే, గాలిలోని కొవిడ్‌-19 ఆర్‌ఎన్‌ఏ వల్ల ఇతరులకి ఇన్ఫెక్షన్‌ సోకిన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని చెప్పారు. చైనాలో కరోనా విజృంభించి తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వూహాన్‌లో రెండు కరోనా ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో పరిశోధకులు అధ్యయనం చేయగా ఈ కొత్త విషయాలు వెల్లడయ్యాయి. నేచర్ రీసెర్చ్‌ జర్నల్‌లో పరిశోధకులు ఈ విషయాలను తెలిపారు.

తమ అధ్యయనంలో భాగంగా ఆ రెండు ఆసుపత్రుల చుట్టూ గాలిలోని నీటి తుంపరలను గుర్తించే ఎలక్ట్రిక్ ఏరోజల్ డిటెక్టర్లను పరిశోధకులు అమర్చారు. ఆయా ఆసుపత్రుల్లో కొవిడ్‌-19 రోగులు వాడే శౌచాలయాలకు తగిన వెంటిలేషన్ లేకపోవడంతో అవి వైరస్‌తో కూడిన తుంపరలకు ఆవాసాలుగా మారాయని వూహాన్ పరిశోధకులు తమ అధ్యయన నివేదికలో తెలిపారు.

దీంతో అక్కడి నుంచే ఈ తుంపరలను వాహకంగా వాడుకొన్న వైరస్ ఆర్ఎన్ఏ ఆ ఆసుపత్రుల పరిసరాల్లోకి ప్రవేశించిందని చెప్పారు. అంతేకాదు, కరోనా రోగులకు చికిత్స చేసిన తర్వాత ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక గదుల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ)లను విప్పేసే సమయంలో గాల్లోకి కరోనా వైరస్‌తో కూడిన తుంపరలు బయటకు వచ్చినట్లు తెలిపారు.

అయితే, ఈ పరిస్థితిని సమర్థవంతమైన శానిటైజేషన్‌తో అరికట్టవచ్చని తెలిపారు. కరోనా రోగులు వాడే శౌచాలయాలకు వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూచించారు. వైరస్ ప్రభావిత హాట్‌స్పాట్లలోనూ ఇలాంటి జాగ్రత్త చర్యలు అత్యవసరమని చెప్పారు.


More Telugu News