కేఏ పాల్ చారిటీలో అవస్థలు పడలేకున్నాం... అధికారులకు ఫోన్ చేసిన విద్యార్థులు!

  • సదాశివపేటలో పాల్ గమ్ సిటీ
  • సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థుల ఫిర్యాదు
  • పోలీసుల సాయంతో సోదాలు చేసిన అధికారులు
  • ఇన్ చార్జ్ ని పిలిపించి హెచ్చరికలు
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కేఏ పాల్ నిర్వహిస్తున్న గమ్ సిటీ చారిటీలో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఓ విద్యార్థి, ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా, పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లిన అధికారులు, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఓ విద్యార్థి నుంచి ఫోన్ అందుకున్న ఎంఈఓ అంజయ్య, పోలీసులకు సమాచారం ఇచ్చి గమ్ సిటీకి వెళ్లేసరికి అక్కడ 10 మంది విద్యార్థులు ఉన్నారు. మిగతా వారంతా లాక్ డౌన్ తో ఇళ్లకు వెళ్లిపోయారని, తాము ఇక్కడే చిక్కుకుని పోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక్కడ తమకు సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపించిన వారు, రోజుకు ఒక్కసారే వండి, దాన్నే రెండు పూటలా పెడుతున్నారని తెలిపారు. నిత్యమూ టమాటా చారు, సాంబారు అన్నమే పెడుతున్నారని, రాత్రుళ్లు పాములు వస్తున్నాయని వాపోయారు. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన అంజయ్య, ఇన్ చార్జ్ ని పిలిపించి, మూడు పూటలా విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహారాన్ని మాత్రమే అందించాలని ఆదేశించారు. ఇన్ చార్జ్ తో స్టోర్ రూమును తెరిపించిన ఆయన, అక్కడున్న పిల్లలకు స్నాక్స్ అందించారు. మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు.


More Telugu News