కరోనా సోకినా ఇంట్లో వుంచే చికిత్స... మమతా బెనర్జీ సంచలన నిర్ణయం!

  • ప్రభుత్వానికీ కొన్ని పరిమితులు ఉంటాయి
  • లక్షల మందిని విడిగా ఉంచే పరిస్థితి లేదు
  • అవకాశాలు ఉంటే ఇంట్లోనే ఉంచి చికిత్సలు
  • ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా పాజిటివ్ గా తేలినా, ఇంట్లోనే క్వారంటైన్ చేసుకునే వీలుంటే, ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేదని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన మమతా బెనర్జీ, పాజిటివ్ గా తేలిన వారు ఇంట్లోనే ఉండి చికిత్సలు పొందవచ్చని సూచించారు. లక్షల మందికి వైరస్ సోకితే, వారందరినీ విడిగా ఉంచి చికిత్సలు అందించే పరిస్థితి లేదని, ఏ ప్రభుత్వానికైనా కొన్ని పరిమితులు ఉండి తీరుతాయని, ఆ కారణం చేతనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు.

కాగా, మమతా బెనర్జీ ప్రకటించిన నిర్ణయంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా సోకినా ఇంట్లోనే ఉంటే, వారి కుటుంబీకులకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఎంతో ఎక్కువ. పూర్తిగా క్వారంటైన్ అయి, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వినియోగిస్తే, కరోనా రోగి ఇంట్లోనే ఉండి కూడా కోలుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మొత్తం కుటుంబానికి వ్యాధి సోకుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


More Telugu News