ఫేస్ బుక్ ఇన్వెస్ట్ చేసిన మూడు రోజుల తరువాత... కీలక ముందడుగేసిన రిలయన్స్ జియో!

  • జియో మార్ట్ సేవలు అందుబాటులోకి
  • ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవలు
  • వాట్స్ యాప్ నంబర్ 8850008000
  • స్థానిక కిరాణా దుకాణాల నుంచే డెలివరీ
ముఖేష్ అంబానీ నేతృత్వంలో పనిచేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ జియో ప్లాట్ ఫామ్ లో దాదాపు 43,574 కోట్లను ఫేస్ బుక్ పెట్టుబడిగా పెట్టిన మూడు రోజుల తరువాత, జియో కీలక ముందడుగు వేసింది. వాట్స్ యాప్ ఆధారిత జియో మార్ట్ ను ఈ లాక్ డౌన్ సమయంలో ప్రారంభించింది. ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లోని జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగాత్మక పరిశీలన అనంతరం, జియో మార్ట్ సేవలు దేశవ్యాప్తం చేయాలన్నది రిలయన్స్ లక్ష్యం.

తమ సేవలు ప్రారంభమయ్యాయని అధికార వెబ్ సైట్ లో వెల్లడించిన జియో మార్ట్ లైట్, ఫేస్ బుక్ అధీనంలోని వాట్స్ యాప్ ద్వారా ఈ షాపింగ్ యాప్ అందుబాటులో ఉంటుందని, ఈ లాక్ డౌన్ సమయంలో అందుబాటులో ఉన్న కొంతమందికైనా ఈ యాప్ నిత్యావసర వస్తువుల అవసరాలను తీరుస్తుందని భావిస్తున్నామని పేర్కొంది.

కాగా, 2027 నాటికి భారత ఈ-కామర్స్ మార్కెట్ సుమారు రూ. 15.22 లక్షల కోట్లకు పెరుగుతుందని కేపీఎంజీ అంచనాలు విడుదల చేసిన వేళ, ఇప్పటికే ఈ రంగంలో పాతుకుపోయిన అమేజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలను ఎదుర్కొని, మార్కెట్ వాటాను సాధించేందుకు ఆసియాలో అత్యధిక ధనవంతుడైన ముఖేష్ అంబానీ, ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆలోచన చేయగా, సామాజిక మాధ్యమ అగ్రగామి ఫేస్ బుక్ చేతులు కలిపింది. సరఫరా వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో జియో మార్ట్ సేవలు ప్రారంభించడం ముఖేశ్ అంబానీ వ్యూహంలో భాగం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫేస్ బుక్ బలం, వాట్స్ యాప్ తోడు జియో మార్ట్ విస్తరణ, అభివృద్ధికి కీలకం కానున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక జియో మార్ట్ వాట్స్ యాప్ నంబర్ 8850008000. ఈ నంబర్ నుంచి కస్టమర్లు, స్థానిక దుకాణదారు వివరాలు తెలుసుకుని, తమ ఆర్డర్ ను ప్లేస్ చేయవచ్చు. ఆపై కస్టమర్లకు తమకు కావాల్సిన సరుకులు ఎప్పుడు, ఎక్కడ పికప్ చేసుకోవాలన్న సమాచారం వాట్స్ యాప్ కు అందుతుందని జియో మార్ట్ లైట్ వెబ్ సైట్ పేర్కొంది.

ఇక పలు ప్రాంతాల్లోని చిన్న చిన్న కిరాణా దుకాణాలను జియో మార్ట్ టార్గెట్ చేసుకుని, అక్కడి నుంచే సరుకులను అందించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కారణంగా మాల్స్ మూతపడగా, బిగ్ బజార్, మోర్ వంటి సూపర్ మార్కెట్లు సేవలను అందించడం లేదు. దీంతో కిరాణాషాపుల వ్యాపారం 39 శాతం పెరిగిందని కన్సల్టెన్సీ సేవల సంస్థ మెకిన్సే అండ్ కో వ్యాఖ్యానించింది. ఇండియాలో వాట్స్ యాప్ కు 30 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉండటంతో, సాధ్యమైనంత ఎక్కువ మందిని చేరుకోవాలన్న లక్ష్యంగా జియో విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొంది.

ఈ వార్తలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈక్విటీ విలువ సోమవారం నాడు 4.1 శాతం పెరిగింది. ఈ సంవత్సరం సెన్సెక్స్ 23 శాతం పతనం కాగా, రిలయన్స్ మాత్రం 3.2 శాతం మాత్రమే నష్టపోయింది.


More Telugu News