అక్టోబర్​లో టీ20 ప్రపంచకప్‌ అసాధ్యం: బీసీసీఐ

  • ఆ టోర్నీలో భాగస్వామి అయ్యే వారి భద్రతపై ఎవరు హామీ ఇస్తారు
  • ప్రశ్నించిన బీసీసీఐ అధికారి
  • వరల్డ్‌కప్‌పై స్పష్టత ఇవ్వని  ఐసీసీ సీఈసీ సమావేశం
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక క్రీడా పోటీలు ఆగిపోయాయి. క్రికెట్‌ పూర్తిగా స్తంభించింది. చాలా టోర్నీలు రద్దవగా.. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్- నవంబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. గతవారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీఈ) చీఫ్  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం కూడా ఈ టోర్నీ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అక్టోబర్-నవంబర్ లో ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిప్రాయపడింది. ఈ టోర్నీ నిర్వహణలో చాలా అంశాలు ప్రభావితం అవుతాయని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. పరిస్థితి తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చిన తర్వాతే క్రికెట్‌ సాధ్యం అవుతుందన్నారు. ఇప్పుడు భారత్‌తో పాటు అనేక దేశాల్లో  ప్రయాణ ఆంక్షలపై  కొత్త మార్గనిర్దేశకాలు వెలువడే అవకాశం ఉందన్నారు.

‘నిజాయతీగా చెప్పాలంటే అక్టోబర్లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ సాధ్యం కాదనిపిస్తోంది. కనీసం  ప్రజలు ఒక్కచోట గుమికూడడం గురించి ఆలోచించడం కూడా ఇప్పుడు కష్టమే. అంతర్జాతీయ ప్రయాణాలు భద్రమో కాదో మనకు తెలియదు. కొందరు జూన్‌ తర్వాత ప్రయాణాలు మొదలవుతాయని అంటున్నారు. మరికొందరు ఇంకా సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఒక్కసారి ప్రయాణాలకు అనుమతి వచ్చిన తర్వాత కరోనా వైరస్ ప్రభావం తగ్గిందో లేదో, దానిపై ప్రయాణాల ప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకోవాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఈ టోర్నీలో భాగస్వామి అయ్యే వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ గానీ, క్రికెట్ ఆస్ట్రేలియా గానీ హామీ ఇస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.


More Telugu News