నేను బతికే ఉన్నానంటూ వీడియో పోస్ట్ చేసిన కరోనా బాధితుడు

  • మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఘటన
  • ఓ వ్యక్తి చనిపోయాడంటూ హెల్త్ బులెటిన్ లో ప్రకటించిన డాక్టర్లు
  • పేరు, అడ్రస్ పొరపాటు కారణంగా ఇలా జరిగిందన్న అధికారులు
కరోనా కారణంగా ప్రజలంతా ఎంతో ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఎక్కడ, ఎన్ని కేసులు బయటపడతాయో అని బెంబేలెత్తిపోతున్నారు. తమ ప్రాంతాలకు సంబంధించి ఏ వార్త వచ్చినా ఉలిక్కి పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కరోనా కారణంగా ఓ వ్యక్తి మరణించాడని అధికారులు ఈనెల 25న విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. మరుసటి రోజు ఆయన మరణవార్త పత్రికల్లో కూడా వచ్చింది. దీంతో, సదరు బాధితుడు తాను చనిపోలేదని, బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సి వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ ఓ వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో విడుదల చేశాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం, తమ తప్పును అధికారులు గ్రహించారు. ఈ సందర్భంగా ఉజ్జయిని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్సుయా గవాలి మాట్లాడుతూ... పేరు, అడ్రస్ లో పొరపాటు కారణంగా ఇది జరిగిందని చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.


More Telugu News