అమ్మాయిలు కురచ దుస్తులు వేసుకుంటున్నారు.. అందుకే ఈ ఉపద్రవాలు!: మతాధికారి వ్యాఖ్యలు

  • పాక్‌ ప్రధాని ఇమ్రాన్  సమక్షంలో ప్రసిద్ధ మతాధికారి ప్రసంగం
  • అమ్మాయిలను పొట్టి దుస్తులు ధరించాలని కోరుతోంది ఎవరు?
  • ఆ పాపానికి జవాబుదారి తనం ఉండాల్సింది ఎవరిది?
  • మమ్మల్ని క్షమించాలని నేను ఆ దేవుడిని కోరుతున్నాను
కరోనా వైరస్‌ విజృంభణపై పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ సమక్షంలో ఆ దేశ ప్రసిద్ధ మతాధికారి తారిక్‌ జమీల్ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎహ్సాస్‌ టెలిథాన్’‌ నిధుల సేకరణలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇమ్రాన్‌ ఖాన్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో తారిక్ జమీల్ మాట్లాడుతూ... పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తికి అమ్మాయిలు కురచ దుస్తులు ధరించడమే కారణమని చెప్పారు. ఇటువంటి అమ్మాయిల ప్రవర్తనపై పాక్‌లో‌ ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు.

'మన దేశంలోని అమ్మాయిలు డ్యాన్సులు చేయడానికి కారణం ఎవరు? వారిని కురచ దుస్తులు ధరించాలని కోరుతోంది ఎవరు? ఆ పాపానికి జవాబుదారీతనం ఉండాల్సింది ఎవరికి? మమ్మల్ని క్షమించాలని నేను ఆ దేవుడిని కోరుతున్నాను. దేశంలోని అమ్మాయిలు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. దేశ యువత నీచమైన దారిలో వెళుతోంది. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు' అని చెప్పుకొచ్చారు. అందుకే కరోనా విజృంభిస్తోందని చెప్పారు.

అంతేకాదు, మీడియాపై కూడా తారిక్ జమీల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. 'ఓ పెద్ద చానెల్ ఓనర్‌ పలు సూచనలు చేయాలని నన్ను అడిగారు. నేను ఆయనకు ఒకటి చెప్పాను. చానెల్‌ను అసత్య ప్రచారం నుంచి దూరంగా ఉండాలని చెప్పాను. అయితే చానెల్‌ మూసేసినా, అసత్య ప్రచారం మాత్రం ఆగదని ఆయన చెప్పాడు. ఇక్కడే కాదు.. ప్రపంచ మీడియా మొత్తం ఇలాగే ఉంది' అని చెప్పుకొచ్చారు.

తారిక్‌ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు తప్పుబట్టారు. చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు. మీడియాపై నోరుపారేసుకున్నట్టు ఒప్పుకున్నారు. అయితే, అమ్మాయిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాత్రం  క్షమాపణలు చెప్పలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మానవ హక్కుల కమిషన్ మండిపడింది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. పాక్‌లోని పలు వార్తా పత్రికలు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.


More Telugu News