తమిళ ప్రజలూ, నన్ను క్షమించండి: సినీ నటుడు దుల్కర్ ‌సల్మాన్‌ భావోద్వేగభరిత ట్వీట్

  • నెట్‌ఫ్లిక్స్‌లో 'వారణే అవశ్యముండే' సినిమా విడుదల
  • ప్రభాకరన్‌ జోక్‌పై విమర్శలు
  • తమిళ ప్రజలను అవమానించేలా ఉందన్న నెటిజన్లు
  • తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారన్న దుల్కర్
సినీనటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన 'వారణే అవశ్యముండే' అనే సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఈ సినిమాలోని ఓ సీన్‌ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ను అవమానించేలా ఉందని విమర్శలు వచ్చాయి. తమిళుల మనోభావాలను దెబ్బతీశారని సామాజిక మాధ్యమాల్లో తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు.

తన తరఫున, ఆ సినిమా యూనిట్‌ తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్టర్‌లో భావోద్వేగభరిత మెసేజ్‌ పోస్ట్ చేశాడు. 'వారణే అవశ్యముండే' సినిమాలో ప్రభాకరన్‌ జోక్‌ తమిళ ప్రజలను అవమానించేలా ఉందని చాలా మంది వ్యాఖ్యానించారని, అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, గతంలో వచ్చిన మలయాళ చిత్రం 'పట్టణ ప్రవేశం' లో, ఓ సీన్‌లోని జోక్‌‌ స్ఫూర్తితో ఆ సన్నివేశాన్ని రూపొందించామని అన్నాడు. ఈ సన్నివేశంపై కేరళలో బాగా మీమ్స్‌ చేస్తారని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. కొందరు సినిమా చూడకుండానే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నాడు.

తన కుటుంబ సభ్యులపైనా, ఈ సినిమాలో నటించిన నటులపైనా విమర్శలు చేయొద్దని కోరాడు. ఒకవేళ ఈ సన్నివేశం వల్ల బాధపడితే తమిళ ప్రజలకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు. కొందరు తనపై చాలా అసభ్యకరంగా విమర్శలు చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపాడు.


More Telugu News