ఢిల్లీలో ప్లాస్మా థెరపీతో కోలుకున్న కరోనా రోగి.. ఆసుపత్రి నుంచి ఇంటికి!

  • ఈ నెల 4న ప్రైవేటు ఆసుపత్రిలో రోగి
  • పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పైకి
  • ప్లాస్మా థెరపీతో అనూహ్యంగా కోలుకున్న వైనం
కరోనా రోగులకు చేస్తున్న ప్లాస్మా థెరపీ చికిత్స ఫలితాన్ని ఇస్తున్నట్టే కనిపిస్తోంది. కరోనా బారినపడి ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి చేసిన ప్లాస్మా థెరపీ చికిత్స విజయవంతమైంది. పూర్తిగా కోలుకున్న 49 ఏళ్ల వ్యక్తి ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాకు ప్లాస్మా చికిత్స తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు.

కరోనా బారిన పడిన బాధితుడు ఈ నెల 4న ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఈ నెల 8న వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ప్లాస్మా థెరపీతో చికిత్స అందించారు.

ఈ చికిత్సతో అతడు క్రమంగా కోలుకుంటుండడం వైద్యుల్లో ఉత్సాహం నింపింది. నాలుగు రోజుల తర్వాత వెంటిలేటర్ తొలగించారు. ఈ నెల 18 వరకు  సప్లిమెంటరీ ఆక్సిజన్ అందిస్తూ వచ్చిన వైద్యులు.. అతడు పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ చేశారు.


More Telugu News