దేశంలో కరోనా వ్యాప్తిపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు

  • ఓ వర్గాన్ని నిందించడం సరికాదని హితవు
  • కొందరు ఇలాంటి అవకాశాలను వాడుకుంటారని వ్యాఖ్యలు
  • ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జూన్ చివరి వరకు నిలిపివేసినట్టు వెల్లడి
కొందరు చేసిన తప్పులకు ఓ వర్గం మొత్తాన్ని నిందించడం భావ్యం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హితవు పలికారు. కరోనా మహమ్మారి జడలు విప్పి నర్తిస్తున్న నేపథ్యంలో కొందరు ఇలాంటి అవకాశాలను దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వాడుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

కోపంతోనో, భయంతోనో ఎవరన్నా తప్పు చేస్తే, దాన్ని సమాజం మొత్తానికి ఆపాదించలేమని, అలాగే వారిని దూరంగా ఉంచలేమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ మార్గదర్శకాల పట్ల ప్రజలు వ్యతిరేకత చూపరాదని, ప్రజల్ని ఆ విధంగా కార్యోన్ముఖుల్ని చేయాల్సిన బాధ్యత వర్గనేతలపై ఉందని పేర్కొన్నారు.

"కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆర్ఎస్ఎస్ కూడా జూన్ చివరి వరకు కార్యక్రమాలు నిలిపివేసింది. కొందరు సృష్టించే సమస్యలు ఆవేశాలకు దారితీస్తుంటాయి. ఇలాంటి వాటి నుంచి లబ్ధి పొందే వాళ్లు రెచ్చగొడుతూనే ఉంటారు" అని వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన సమావేశం కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


More Telugu News