అప్పటి వరకు దేశంలో కరోనాను జయించలేం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

  • తగినన్ని పరీక్షలు చేయట్లేదు
  • పెద్ద ఎత్తున పరీక్షలు చేసే సదుపాయాలను కల్పించాలి
  • కరోనా బాధితులను గుర్తించాలి
దేశంలో పెరిగిపోతోన్న కరోనా వైరస్ కేసులపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా పరీక్షల సంఖ్యపై ఆయన స్పందిస్తూ సూచనలు చేశారు. కరోనాపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన సూచనలను ఆ పార్టీ వీడియో రూపంలో తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున పరీక్షలు చేయడం, కరోనా బాధితులను గుర్తించి ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందించడం చాలా ముఖ్యమని అందులో కాంగ్రెస్ నేతలు తెలిపారు.
 
'దేశంలో ఓ సమస్య ఉంది... తగినన్ని పరీక్షలు చేయట్లేదు. పెద్ద ఎత్తున పరీక్షలు చేసే సదుపాయాలను పెంచలేకపోతే కరోనాపై విజయం సాధించడం సాధ్యం కాదు' అని  మన్మోహన్ సింగ్ తెలిపారు.

'దేశంలోని వలస కూలీలను రక్షించాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. కూలీల సమస్యను తీర్చడానికి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. కూలీలను తమ రాష్ట్రాలకు తరలించే విషయం రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చలపైనే ఆధారపడి ఉంటుంది. కరోనా పరీక్షలు నిర్వహించడం, బాధితులను గుర్తించడం వంటి అంశాలు కరోనాపై పోరాటంలో చాలా ముఖ్యమైనవి. వలస కూలీల సమస్యలు తీర్చడానికి మానవత్వంతో ఆలోచించాలి.. వారికి ఆర్థిక సాయం చేయాలి' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు.

వలస కూలీలకు డబ్బు, ఆహారం అందించాలని కాంగ్రెస్ నేత చిదంబరం కోరారు. కరోనాపై పోరాడే క్రమంలో ప్రభుత్వం విఫలమవుతోందని, కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఒత్తిడి తీసుకురావాల్సి ఉందని కాంగ్రెస్ నేత కేసీ వేణు గోపాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక ఉద్దీపన చర్యలు సరిగ్గా లేవని, మరో అడుగు ముందుకేసి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు.


More Telugu News