కిమ్ జాంగ్ ఉన్ మాత్రమే ప్రయాణించే రైలు... ఆచూకీని పసిగట్టిన '38 నార్త్' వెబ్ సైట్!

  • వోన్ సన్ రిసార్ట్ రైల్వే స్టేషన్ వద్ద రైలు
  • శాటిలైట్ చిత్రాలను సంపాదించిన వెబ్ సైట్
  • అదే నిజమైతే ఆనారోగ్యంపై వార్తలకు బలం
  • పెంటగాన్ ఉన్నతాధికారి అభిప్రాయం
గుండెకు శస్త్రచికిత్స తరువాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తలు మినహా, ఆయన ఎక్కడ, ఎలా ఉన్నారన్న విషయమై ఎటువంటి సమాచారమూ లేదు. ఆయన ఆరోగ్యం బాగాలేదని మాత్రం ఇంటర్నేషనల్ మీడియా పలు కథనాలను ప్రచురించింది. ఇదే అంశంపై వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న '38 నార్త్' అనే వెబ్ సైట్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం, కిమ్ హాలిడే స్పాట్ గా పేరున్న వోన్ సన్ ప్రాంత రిసార్టులో ఉండి ఉండవచ్చు. దేశాధ్యక్షుడు కిమ్, ఆయన కుటుంబీకులు ప్రయాణించేందుకు ఓ రైలు ఉంది. దీన్ని ఇతరులు ఎవరూ వాడరు. ఈ రైలు వోన్ సన్ రిసార్టు రైల్వే స్టేషన్ లో ఆగివుండటాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా చూసి, వాటిని సంపాదించిన వెబ్ సైట్, అక్కడే కిమ్ ఉండవచ్చని పేర్కొంది.

అయితే, అది కచ్చితమైన సమాచారం ఏమీ కాదని, ఆయన ఆరోగ్యంపై తమకేమీ తెలియదని వెల్లడించింది. అయితే, రైలు మాత్రం ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు ఆ స్టేషన్ లోనే ఉందని శాటిలైట్ చిత్రాలు నిరూపించాయని తెలిపింది. కాగా, ఈ విషయమై స్పందించిన పెంటగాన్ ఉన్నతాధికారి ఒకరు, కిమ్ కు మాత్రమే పరిమితమైన రైలు వోన్ సాన్ లో మూడు రోజులు నిలిచివుంటే మాత్రం, ఆయన అనారోగ్యం వార్తలకు బలం చేకూరినట్టేనని అభిప్రాయపడ్డారు.

కాగా, కిమ్ కోసం చైనా నుంచి ఓ ప్రత్యేక వైద్య బృందం, దౌత్యాధికారులు వెళ్లారని కూడా మరో వార్త వచ్చింది. వీరు గురువారం నాడు పాంగ్ యాంగ్ చేరుకోగా, ఈ న్యూస్ కూడా ఆయన ఆరోగ్యంపై అనుమానాలను పెంచింది. ఏదిఏమైనా కిమ్ ఆరోగ్యంపై ఎటువంటి అనుమానాలూ లేవని కొరియా సెంట్రల్ న్యూస్ ఏజన్సీ వ్యాఖ్యానించింది. బుధవారం నాడు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు కిమ్ ఓ సందేశాన్ని పంపారని పేర్కొంది.


More Telugu News