భారతీయుల మనోబలాన్ని పెంచిన 'తాలీ, థాలీ, దియా': మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • చప్పట్లు, దీపాల వెలిగింపును ప్రస్తావించిన మోదీ 
  • ధాన్యాల కొరతను తీర్చేందుకు రైతులు శ్రమిస్తున్నారు
  • 130 కోట్ల మందికి శిరస్సు వంచి నమస్కారం
  • 'మన్ కీ బాత్'లో నరేంద్ర మోదీ
నేడు జాతిని ఉద్దేశించి తన 'మన్ కీ బాత్'లో భాగంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. భారత ప్రజల మనోబలాన్ని 'తాలీ, థాలీ, దియా'లు ద్విగుణీకృతం చేశాయని అన్నారు. లాక్ డౌన్ తొలిదశలో జనతా కర్ఫ్యూ సందర్భంగా కొట్టిన చప్పట్లు (తాలియా), ఆపై తన పిలుపుమేరకు ఇంటి ముందు దీపాలను (దియా) వెలిగించిన సందర్భాన్ని ప్రధాని గుర్తు చేశారు.

ఇదే స్ఫూరిని ఆహార ధాన్యాల (థాలీ) విషయంలో రైతులు ప్రదర్శించారని కొనియాడారు. "మన రైతులు దేశ ప్రజల ఆకలిని తీర్చేందుకు రేయింబవళ్లూ కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆకలి బాధలో ఉండకూడదన్న ఉద్దేశం వారి మదిలో బలంగా నాటుకుని ఉంది. కరోనా మహమ్మారి విషయంలో 130 కోట్ల మంది భారతీయులూ చూపిస్తున్న స్ఫూర్తికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పేదరికంతో కూడా పోరాటం సాగిస్తున్నామని, మోదీ తెలిపారు. ఇండియాలోని ప్రతి రంగమూ వినూత్న రీతిలో తమదైన శైలిలో పోరాటం సాగిస్తున్నాయని, విమానయాన రంగం నుంచి రైల్వే రంగం వరకూ ఔషధాలు, ఇతర నిత్యావసరాలను దేశంలోని మూలమూలలకూ చేరుస్తున్నాయని అన్నారు.


More Telugu News