భవన నిర్మాణ కార్మికులకు రూ. 10 వేలు ఇవ్వాలి: సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ

  • వారికి చంద్రన్న బీమా పునరుద్ధరించాలి
  • నూతన ఇసుక పాలసీ, లాక్‌డౌన్‌తో వాళ్లు ఉపాధి కోల్పోయారు
  • కుటుంబాలను పోషించలేక ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది
  • రూ. 1900 కోట్ల బిల్డింగ్ సెస్‌ను వారి సంక్షేమానికి వాడాలి
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్.ఎస్ జగన్మోహన్ రెడ్డికి  తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ఇసుక విధానం తర్వాత చాలా మంది ఉపాధి కోల్పోయారని, ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా వాళ్లు మరింత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు యాభై లక్షల మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, దాంతో తమ కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడడం తనను ఎంతగానో కలచి వేసిందని అన్నారు. రూ. 1900 కోట్ల బిల్డింగ్ సెస్‌ను వారి సంక్షేమానికి ఖర్చు చేయాలన్నారు. వారికి రూ. 10 వేల తక్షణ సాయం అందించి, చంద్రన్న బీమా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

‘లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ ఏడాది ఇసుక సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజాగా లాక్ డౌన్ వల్ల పూట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారు. నూతన ఇసుక విధానం వల్ల ఉపాధి లేక, కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో కలచి వేసింది. ఇప్పుడు లాక్ డౌన్ వారిని మరింత దెబ్బతీసింది. కార్మికులకు అందుబాటులో ఉన్న రూ. 1900 కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు  10 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందించి, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలి. అలాగే, వారి భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని  సీఎంకు రాసిన లేఖలో లోకేశ్ పేర్కొన్నారు.


More Telugu News