నన్ను చూడ్డానికి వచ్చిన మా తమ్ముడు ఇక్కడే చిక్కుకున్నాడు: రకుల్ ప్రీత్ సింగ్

  • నా జీవితంలో  అతి పెద్ద విరామం ఇదే
  • ప్రతి రోజు సాయంత్రం ఓ సినిమా చూస్తున్నా
  • మా తమ్ముడు నాతో పాటే ఉండడం అదృష్టం
కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. సినీ ప్రముఖులంతా చాలా రోజులుగా తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలో ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన జీవితంలో ఇదే అతి పెద్ద విరామం అంటోంది. లాక్‌డౌన్‌లో తాను రోజంతా ఏం చేస్తున్నదీ ఓ ఆంగ్ల పత్రికతో పంచుకుంది...

 ‘చివరగా మార్చి 18న షూటింగ్‌లో పాల్గొన్నా. అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యా. లాక్‌డౌన్‌ తర్వాత బద్ధకస్తురాలిగా మారకుండా రోజూ కఠిన షెడ్యూల్‌ ను ఏర్పాటు చేసుకున్నా. ఉదయం 6.30-7 మధ్య నిద్ర లేస్తున్నా. కాసేపు పుస్తకాలు చదివి యోగా, ధ్యానం చేస్తున్నా. ఇప్పుడు నేను ‘వై వి స్లీప్‌’ అనే పుస్తకం చదువుతున్నా.

ఇక మధ్యాహ్నం సోషల్ మీడియా లైవ్స్, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. గత  రెండేళ్ల నుంచి ఆస్కార్ అవార్డులు గెలిచిన చిత్రాలన్నీ చూశా. ప్రతీ సాయంత్రం ఒక సినిమా, రెండు మూడు షోలు చూస్తున్నా. మా ఇంట్లో వంట మనిషి ఉన్నా.. నేనే వంట చేస్తున్నా. యూట్యూబ్‌లో వంటల చానల్‌ కూడా ప్రారంభించా. అదృష్టవశాత్తు మా తమ్ముడు నాతోనే ఉన్నాడు. లాక్‌డౌన్‌ మొదలయ్యే ముందు రోజు నన్ను చూడ్డానికి ముంబై వచ్చి ఇక్కడే చిక్కుకున్నాడు’ అని రకుల్ చెప్పింది.

‘ఇంత సుదీర్ఘ కాలం పాటు నేను ఇంట్లో ఉండడం ఇదే తొలిసారి. ఇంతకాలం ఇంట్లోనే ఉండడం కొత్త అనుభూతి. ఒకరకంగా ఇది మంచిది కూడా. ఎందుకంటే  మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా.. ప్రకృతికి సొంత మార్గాలు ఉంటాయని మనం అర్థం చేసుకుంటాం. మనం ఆత్మ పరిశీలన చేసుకునే సమయమిది. మీతో మీరు కనెక్ట్ అయ్యే సమయం. ప్రస్తుతం నేను నా వ్యక్తిత్వ వికాసానికే అధిక సమయం కేటాయిస్తున్నా.

ఈ సంక్షోభ సమయంలో మీ ఆరోగ్యం, మీరు ప్రేమించే వ్యక్తులు, మీ జ్ఞాపకాలే ముఖ్యమని గ్రహించాలి. ఈ మహమ్మారి నుంచి బయటపడే వరకు ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి. మీరు ప్రేమించే వ్యక్తులు, ఈ ప్రపంచం కోసం ప్రార్థించండి’ అంటూ రకుల్ వివరించింది.


More Telugu News