ఆటలు కాదు ముందుగా పాఠాలు మొదలెట్టాలి: కపిల్ దేవ్ సూచన

  • లాక్‌డౌన్‌తో విద్యార్థులు చాలా నష్టపోతున్నారు
  • తొలుత విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలి
  • ఆ తర్వాతే క్రికెట్ గురించి ఆలోచించాలి
కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ అయ్యాయి. అన్ని రంగాలతో పాటు క్రీడా రంగం కూడా స్తంభించింది. ముఖ్యంగా భారతీయులు ఎంతగానో ఇష్టపడే క్రికెట్ ఆగిపోయింది. చాలా సిరీస్‌లు రద్దవగా... ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్‌ తిరిగి మొదలవడం కంటే.. పాఠశాలలు, కళాశాలలు మూతపడడంతో నష్టపోతున్న విద్యార్థుల గురించే  ఆందోళన చెందుతున్నానని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అంటున్నారు. క్రికెట్ కన్నా ముందు విద్యా సంస్థలు తెరుచుకోవాలని ఆశిస్తున్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ పునరుద్ధరణ  కంటే విద్యార్థుల చదువుల గురించే ఆలోచించాలని  ఓ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ‘నేను విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నా. మనం చర్చించేందుకు క్రికెట్ సమస్య ఒక్కటే ఉందా? నేనైతే పాఠశాలలు, కళాశాలలకు దూరమైన విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నా. వాళ్లే మన భావితరాలు. అందువల్ల ముందుగా విద్యాసంస్థలనే ప్రారంభించాలని నేను కోరుతున్నా. ఆ తర్వాతే క్రికెట్, ఫుట్‌బాల్‌ గురించి ఆలోచించాలి’ అని కపిల్ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై పోరాటానికి విరాళాలు సేకరించడం  కోసం భారత్‌, పాకిస్థాన్ మధ్య  వన్డే  సిరీస్ నిర్వహించాలన్న పాక్ మాజీ పేసర్  షోయబ్ అక్తర్ ప్రతిపాదనను కపిల్ మరోసారి తిరస్కరించారు. విరాళాలు సేకరించడానికి చాలా మార్గాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ ముఖ్యం కాదన్నారు. పాక్‌కు డబ్బు కావాలంటే ముందుగా సరిహద్దుల్లో హింసను ఆపాలని సూచించారు.


More Telugu News