'ఇల్లు ఖాళీ చేసి, సామగ్రిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లు' అంటూ వైద్యురాలిని వేధించిన యజమాని

  • అసభ్య పదజాలంతో తిట్టిన ఓనర్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైద్యురాలు
  • చర్యలు తీసుకుంటామన్న మంత్రి ఈటల
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తోన్న వైద్యులకు తాము ఉంటోన్న ఇంటి యజమానుల నుంచి వేధింపులు తప్పట్లేదు. ఇల్లు ఖాళీ చేయాలంటూ వైద్యులను వేధింపులకు గురిచేసే ఇంటి ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటూనే వున్నాయి.

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్విగ్ధా అనే వైద్యురాలిని ఇల్లు ఖాళీ చేయాలంటూ ఇంటి యజమాని వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఓ మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో డాక్టర్ స్విగ్ధా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాను ఉంటోన్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని, తన సామగ్రిని తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో పెట్టుకోమని దురుసుగా చెబుతున్నాడని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని ఆమె తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇలాంటి చర్యలకు పాల్పడే ఇంటి యజమానులపై  కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.


More Telugu News