ముక్కులోని ఆ రెండు కణాలే.. కరోనా వైరస్ కు ప్రవేశ మార్గాలు!

  • టీఎంపీఆర్ఎస్ఎస్2, ఏసీఈ2 అనే ప్రొటీన్లు వైరస్ కు మార్గాలు
  • ముక్కులోని సిలియేటెడ్ కణాలు, గొబ్లెట్ కణాల్లో ఎక్కువగా ఉన్న పై ప్రొటీన్లు
  • నెదర్లాండ్స్, బ్రిటన్ యూనివర్శిటీల అధ్యయనం
కొత్తగా పుట్టుకొచ్చి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వైరస్ పై పూర్తి  స్థాయిలో అధ్యయనాలు జరుగుతున్నాయి. దీని ఆట కట్టించేందుకు అవసరమైన వ్యాక్సిన్, ఔషధాలను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు. ఇప్పటికే ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో, శాస్త్రవేత్తలు ఒక కీలకమైన అంశాన్ని గుర్తించారు. మనిషి ముక్కులోని రెండు కణాలు కరోనా వైరస్ కు ప్రవేశ ద్వారాలుగా వ్యవహరిస్తున్నట్టు సైంటిస్టులు కనిపెట్టారు.

నెదర్లాండ్స్ లోని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ గ్రొనిన్ జెన్, బ్రిటన్ లోని వెల్ కమ్ సాంగర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వైరస్ పై పరిశోధనలు జరిపారు. ఈ రీసర్చ్ లో టీఎంపీఆర్ఎస్ఎస్2, ఏసీఈ2 అనే రెండు ప్రొటీన్లు వైరస్ ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయని గుర్తించారు. ముక్కు లైనింగ్ మీదున్న కణాలతో పాటు వివిధ అవయవాల్లో ఇవి ఉన్నట్టు తేల్చారు. అయితే ఇతర ప్రాంతాల్లో కంటే ముక్కులోని సిలియేటెడ్ కణాలు, గొబ్లెట్ కణాల్లో ఈ ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ కణాలు ఇన్ఫెక్షన్ కు ప్రాథమిక మార్గాలుగా ఉపయోగపడుతున్నాయని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సుంగ్నాక్ తెలిపారు.


More Telugu News