కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు నిలిపివేయడం అమానవీయం: రాహుల్ గాంధీ

  • ఏడాదిపాటు డీఏ పెంపుదల నిలిపివేసిన కేంద్రం
  • కేంద్రంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • బుల్లెట్ రైళ్లు, సుందరీకరణ ప్రాజెక్టులు నిలిపివేస్తే బాగుండేదన్న రాహుల్
కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదలను ఏడాది కాలం పాటు నిలిపివేస్తూ కేంద్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.

మధ్య తరగతి ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉండే డీఏ పెంపుదలను స్తంభింపజేయడం అనాగరికం అని, అమానవీయం అని రాహుల్ గాంధీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. డీఏ పెంపు నిలిపివేయడం కంటే కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ ప్రాజెక్టులను పక్కనబెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తద్వారా ఎంతో డబ్బు ఆదా అయ్యేదని వివరించారు.

"కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు, జవాన్లు ఎంతోమంది కరోనాపై ముందుండి పోరాడుతున్నారు. లక్షలాది కోట్ల రూపాయలతో చేపడుతున్న బుల్లెట్ రైళ్లు, సెంట్రల్ విస్టా సుందరీకరణ ప్రాజెక్టులను నిలిపివేయకుండా, అమానవీయ రీతిలో, ఏమాత్రం జ్ఞానం లేకుండా డీఏ పెంపు నిలిపి వేశారు" అంటూ ట్వీట్ చేశారు.

అటు, కాంగ్రెస్ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కూడా కేంద్రంపై ధ్వజమెత్తారు. సొంత ఖర్చులను 30 శాతం తగ్గించుకుని, సుందరీకరణ ప్రాజెక్టులను నిలిపివేసి కూడా కరోనా సంక్షోభంలో ఆదా చేయవచ్చని అన్నారు. ఈ విపత్తు సమయంలో పేదలకు సాయం చేయాల్సింది పోయి వారిని మరింత బాధిస్తోందంటూ కేంద్రంపై మండిపడ్డారు. 


More Telugu News