తనను 'సిల్వర్ సింధు' అనేవారని పీవీ సింధు ఆవేదన!

  • 2019లో వరల్డ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సింధు
  • అంతకుముందు రెండు పర్యాయాలు ఫైనల్ మెట్టుపై విఫలం
  • 2017, 2018లో సిల్వర్ మెడల్స్ సాధించిన సింధు
భారత బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో తెలుగమ్మాయి పీవీ సింధు ఓ సంచలనం. ఇటీవలే వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ నెగ్గి ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. అయితే ఆ ఘనత సాధించడానికి ముందు సింధు పలు మార్లు ఫైనల్ మెట్టు వరకు వచ్చి విఫలమైన సందర్భాలున్నాయి. తాజాగా డబుల్ ట్రబుల్ అనే ఆన్ లైన్ కార్యక్రమంలో మహిళా క్రికెటర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్ అడిగిన ప్రశ్నలకు పీవీ సింధు సమాధానాలు ఇచ్చింది.

"2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీకి ముందు నాపై చాలా ఒత్తిడి ఉంది. అంతకుముందే ఇదే టోర్నీలో రెండు సిల్వర్ మెడల్స్, రెండు కాంస్య పతకాలు గెలిచాను. రెండు పర్యాయాలు ఫైనల్ చేరినా సెకండ్ ప్లేసుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో ప్రజలు 'సిల్వర్ సింధు' అనడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే 2019 టోర్నీలో ఫైనల్ చేరాను. ఆ ఫైనల్లోనూ ఓడిపోయి ప్రజలతో మళ్లీ 'సిల్వర్ సింధు' అనిపించుకోవడం ఇష్టంలేదు. అందుకే సర్వశక్తులు ఒడ్డి జపాన్ అమ్మాయి నజోమీ ఒకుహరాపై గెలిచి వరల్డ్ టైటిల్ చేజిక్కించుకున్నాను" అని సింధు వివరించింది.

సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ చరిత్రలో 2013, 2014లో కాంస్య పతకాలు గెలవగా, 2017, 2018లో రజత పతకాలు అందుకుంది. ఇక, 2019లో స్విట్జర్లాండ్ లోని బేసెల్ లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచి భారత కీర్తిపతాక రెపరెపలాడేలా చేసింది.


More Telugu News