కిమ్ ఆరోగ్యం విషమించిందన్న సీఎన్ఎన్‌పై ట్రంప్ మండిపాటు

  • కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు
  • సీఎన్ఎన్ నిరాధార వార్తలు ప్రచురిస్తోంది
  • వైట్ హౌస్ వేదికగా ట్రంప్ ఆగ్రహం
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ ఆరోగ్యం విషమించిందంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆ వార్తలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వార్తలను ప్రచురించిన సీఎన్ఎన్ వార్తా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వైట్‌హౌస్‌లో ఆయన మాట్లాడుతూ కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. కిమ్ ఆరోగ్యంపై ఉత్తర కొరియా నుంచి ఏమైనా సమాచారం అందిందా? అన్న ప్రశ్నకు మాత్రం ట్రంప్ నుంచి సమాధానం రాలేదు.

కాగా, గుండెకు జరిగిన శస్త్రచికిత్స తర్వాత కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ సీఎన్ఎన్ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి ఒకరు ఈ విషయాన్ని చెప్పారని పేర్కొంది. ఉత్తరకొరియాపై నిఘా ఉంచే దక్షిణ కొరియాకు చెందిన ఆన్‌లైన్ వెబ్‌సైట్ ‘డైలీ ఎన్‌కే’ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కిమ్ ప్రస్తుతం ఫియాంగన్‌లోని ఓ విల్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొంది. అయితే, కిమ్ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తలపై పొరుగుదేశం దక్షిణ కొరియా మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.


More Telugu News