కరోనాను నికోటిన్ అడ్డుకుంటుందా?... ఫ్రాన్స్ లో తాజా అధ్యయనంలో వెల్లడైన కొత్త విషయం!

  • వైరస్ రక్త కణాలకు అంటకుండా అడ్డుకుంటున్న నికోటిన్
  • తదుపరి పరిశోధనలు చేసేందుకు అనుమతి కోరుతున్న ఫ్రాన్స్
  • అనుమతిస్తే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామన్న రీసెర్చర్లు
పొగాకును వాడటం ఆరోగ్యానికి అనర్ధమే అయినా, అందులోని నికోటిన్ కరోనా వైరస్ శరీరంలోని రక్త కణాలకు అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఫ్రాన్స్ కు చెందిన రీసెర్చర్ల బృందం చెబుతోంది. తాము పరిశీలించిన గణాంకాలు దీన్నే నిరూపిస్తున్నాయని, అయితే, ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఓ నిర్ధారణకు రాకుండా, మరింత అధ్యయనం చేస్తున్నామని అధ్యయనకర్తల్లో ఒకరైన జహీర్ అమౌరా వ్యాఖ్యానించారు.

పారిస్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరిన 343 మందితో పాటు, స్వల్పంగా వైరస్ లక్షణాలున్న 139 మందిని పరిశీలించామని, వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే పొగతాగే వారున్నారని ఆయన తెలిపారు. ఫ్రాన్స్ లో 35 శాతం మంది ప్రజలు స్మోకర్లేనని గుర్తు చేసిన ఆయన, ఆ నిష్పత్తి ప్రకారం, పొగతాగే వారిలో 150 మందికి పైగా వ్యాధి సోకాలని, కానీ అది జరుగలేదని అన్నారు.

గత నెలలో న్యూజిలాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఓ అధ్యయనాన్ని వారు ఉటంకిస్తూ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం, చైనాలోని కార్మికుల్లో 26 శాతం మంది స్మోకింగ్ కు అలవాటు పడిన వారేనని, కానీ, వైరస్ సోకిన వారిలో 12.6 శాతం మంది మాత్రమే పొగతాగే వారున్నారని తెలిపారు.

మానవ శరీరంలోని కణ గ్రాహకాలను పట్టుకుని ఉండే నికోటిన్, ఆ కణం దగ్గరికి వచ్చిన కరోనా సూక్ష్మజీవిని కణంలోకి వెళ్లకుండా, శరీరం అంతటా వ్యాపించకుండా అడ్డుకుంటున్నదని అధ్యయన సహ రచయిత, పాశ్చర్ ఇనిస్టిట్యూట్ న్యూరోబయాలజిస్ట్ జీన్ పెయిరీ చాంగ్యుక్స్ వెల్లడించారు. ఇక కరోనా, నికోటిన్ విషయంలో తదుపరి అధ్యయనం క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

తమకు అనుమతి లభిస్తే, పారిస్ లోని పిట్టీ-సాల్ పెట్రియర్ ఆసుపత్రిలో హెల్త్ వర్కర్లకు నికోటిన్ ప్యాచ్ లను అందించి, వారు కరోనా నుంచి ఎంత మేరకు రక్షించబడతారన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఇవే నికోటిన్ ప్యాచ్ లను ఇప్పటికే వ్యాధి బారిన పడిన రోగులకు ఇస్తే, వారిలో లక్షణాలేమైనా తగ్గుతాయా? అన్న విషయాన్నీ పరిశీలిస్తామని అమోరా వెల్లడించారు.

ఈ విషయంలో తదుపరి పరిశోధనలు జరిగి ఓ నిర్ణయానికి వచ్చేంత వరకూ ప్రజలు కొత్తగా పొగ తాగడానికి అలవాటు పడరాదని, నికోటిన్ ప్యాచ్ లను వాడితే, కరోనా సోకదని కూడా భావించరాదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. నికోటిన్ కలిగించే శారీరక రుగ్మతలను ఎవరూ మరువరాదని హెచ్చరించారు. ఫ్రాన్స్ లో ప్రతియేటా నమోదయ్యే మరణాల్లో 75 వేలు పొగాకు వాడకం కారణంగా నమోదయ్యేవేనని గుర్తు చేశారు.


More Telugu News