రాజధానికి దూరంగా.. ఉత్తర కొరియా నియంత కిమ్ కుటుంబ సభ్యుల కోసమే ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి!

  • కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు
  • ఏప్రిల్ 11 తర్వాత కనిపించని ఉత్తర కొరియా అధినేత
  • ఆసక్తికర విషయాలు తెలిపిన డైలీ ఎన్కే
తన నియంతృత్వ పోకడలతో ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో కథనాలు వస్తున్నాయి. ఆయన బ్రెయిన్ డెడ్ కు గురయ్యారన్నది వాటిలో ప్రధానమైనది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం కిమ్ పరిస్థితి విషమించిందని ప్రచారం జరిగింది. దీనిపై ఉత్తర కొరియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక అసలు విషయానికొస్తే, ఉత్తర కొరియాకు సంబంధించిన విషయాలకే అధిక ప్రాధాన్యత నిచ్చే దక్షిణకొరియా న్యూస్ ఏజెన్సీ డైలీ ఎన్కే ఆసక్తికర వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ ఓ ప్రత్యేకమైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

ఈ ఆసుపత్రి ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ కు 150 కిలోమీటర్ల దూరంలోని హ్యాంగ్ సాన్ లో ఉంది. ఇందులో ప్రధానంగా హృద్రోగ సంబంధిత వ్యాధుల చికిత్స అందిస్తారు. హ్యాంగ్ సాన్ ఆసుపత్రిని ప్రత్యేకంగా కిమ్ కుటుంబ సభ్యుల కోసమే నిర్మించారు. కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ మరణం తర్వాత 1994లో నిర్మాణం జరుపుకున్న ఈ అత్యాధునిక వైద్యశాలలో అత్యాధునిక సౌకర్యాలున్నాయి. కాగా, కిమ్ గుండెకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య నిపుణుడు విదేశాల్లో శిక్షణ పొందారు. ఆ వైద్యుడికి ప్రభుత్వం భారీ భద్రత కల్పిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఉంటుంది.

ఇక హ్యాంగ్ సాన్ ఆసుపత్రిలో ఉన్న వైద్య పరికరాలను జర్మనీ, జపాన్ దేశాల నుంచి తెప్పించారని డైలీ ఎన్కే వెల్లడించింది. కాగా, రాజధానికి దూరంగా ఈ ఆసుపత్రిని నిర్మించడానికి మరో కారణం ఏమిటంటే, తనను, తన కుటుంబాన్ని ఇతర దేశాల నిఘా నుంచి కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని కిమ్ భావించడమేనని సదరు వార్తాసంస్థ పేర్కొంది.

ఇటీవల జరిగిన తన తాత కిమ్ ఇల్ సంగ్ 108వ జయంతి వేడుకల్లో కిమ్ కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యస్థితిపై సందేహాలు మొదలయ్యాయి. కిమ్ చివరిగా దర్శనమిచ్చింది ఏప్రిల్ 11న జరిగిన ఓ సమావేశంలో. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ మీడియా సంస్థతో పాటు అమెరికా ప్రభుత్వం కూడా కిమ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం ఉందని పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది.


More Telugu News